Prabhas: 'ది రాజాసాబ్' .. పబ్లిక్ టాక్!

The Rajasaab Movie Public Talk
  • భారీ బడ్జెట్ తో నిర్మితమైన 'ది రాజా సాబ్'
  • వీఎఫ్ ఎక్స్ బాగున్నాయంటున్న ఫ్యాన్స్ 
  • రొమాన్స్ - కామెడీ వర్కౌట్ అయిందని వెల్లడి
  • ప్రభాస్ నటన హైలైట్ అంటూ ప్రశంసలు 
  • దర్శకుడు కన్ఫ్యూజ్ చేశాడంటున్న ఆడియన్స్ 
  • ప్రభాస్ కటౌట్ కి తగిన కంటెంట్ కాదని విమర్శలు  


ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ది రాజా సాబ్' ఈ రోజున థియేటర్లకు వచ్చేసింది. సంక్రాంతి కానుకగా వదిలిన ఈ సినిమా, విడుదలైన ప్రతి థియేటర్ దగ్గర ఒక రేంజ్ లో సందడి చేస్తోంది. ఎక్కడ చూసినా ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా కనిపిస్తోంది. మాస్ .. క్లాస్ .. యూత్ .. ఫ్యామిలీ ఆడియన్స్ .. ఇలా అన్ని వర్గాలవారిని 'రాజా సాబ్' థియేటర్స్ కి రప్పిస్తున్నాడు. అందువలన టికెట్ల అమ్మకం జోరుగా కొనసాగుతోంది. అయితే ఈ సినిమా చూసిన ప్రేక్షకులలో ఎవరికివారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం థియేటర్స్ దగ్గర కనిపిస్తోంది. ప్రభాస్ నటనను .. ఆయన కామెడీ టైమింగ్ ను గురించి మెచ్చుకుంటున్న కొందరు ఆడియన్స్, దర్శకుడు మారుతిని విమర్శించడం వినిపిస్తోంది.

 ఇది ప్రభాస్ కి తగిన కంటెంట్ కాదనీ .. ప్రభాస్ కి తగిన కంటెంట్ ను తయారు చేసుకోవడంలో మారుతి తడబడ్డాడని ఆడియన్స్ చెబుతున్నారు. కథను ఎటెటో తీసుకుని వెళుతూ, ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేశాడని అంటున్నారు. 'ది రాజా సాబ్' అనే టైటిల్ వినగానే, ప్రభాస్ ను అభిమానులు ఒక రేంజ్ లో ఊహించుకున్నారనీ, అయితే ఆ స్థాయిలో ఆయనను చూపించడంలో మారుతి విఫలమయ్యాడని అంటున్నారు. ఒక పాన్ ఇండియా స్టార్ ఇచ్చిన ఛాన్స్ ను ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయాడని చెబుతున్నారు. 

ఇక కొందరు అభిమానులు మాత్రం, ప్రభాస్ ను కొత్తగా చూపించాలనే ఉద్దేశంతోనే మారుతి ఈ కథను సెట్ చేసుకున్నాడని అంటున్నారు. ప్రభాస్ తెరపై కామెడీ చేసి .. డాన్సులు చేసి .. రొమాన్స్ చేసి చాలా కాలమైందనీ, అందువల్లనే ఆయనను ఆ కోణాల్లో చూపించడానికి మారుతి ప్రయత్నించాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కామెడీ సీన్స్ .. మొసళ్లతో కూడిన యాక్షన్ సీన్ బాగా వచ్చాయని చెబుతున్నారు. అలాగే వీఎఫ్ఎక్స్ .. క్లైమాక్స్ మెప్పిస్తాయని బలంగా చెబుతున్నారు. ఇలాంటి ప్రశంసలు .. విమర్శల సంగతి అలా ఉంచితే, ఫైనల్ గా ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందనేది చూడాలి మరి. 


Prabhas
The Raja Saab
Maruthi
Telugu movie review
Sankranti release
Prabhas fans
Telugu cinema
Pan India Star
Movie collections
Public talk

More Telugu News