The Raja Saab: 'రాజాసాబ్' టిక్కెట్ ధరల పెంపు.. తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

The Raja Saab Ticket Price Hike Angers Telangana High Court
  • టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం కల్పించడాన్ని తప్పుబట్టిన హైకోర్టు
  • తెలివిగా మెమోలు ఎందుకు ఇస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
  • మంత్రి స్వయంగా టిక్కెట్ ధరలను పెంచబోమని ప్రకటించారని గుర్తు చేసిన హైకోర్టు
సినిమా టిక్కెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభాస్ నటించిన 'ది రాజాసాబ్' సినిమా టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు అధికారులు అనుమతించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

ధరల పెంపునకు అవకాశం కల్పిస్తూ తెలివిగా మెమోలు ఎందుకు ఇస్తున్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. సినిమా టిక్కెట్ ధరలను పెంచబోమని సినిమాటోగ్రఫీ మంత్రి స్వయంగా ప్రకటన చేశారని గుర్తు చేసింది. అయినప్పటికీ ధరలు పెంచుకోవచ్చని మెమోలు ఎందుకు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా మీ ఆలోచన ఎందుకు మారడం లేదని హైకోర్టు నిలదీసింది. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియవా అని వ్యాఖ్యానించింది.

'ది రాజాసాబ్' సినిమా టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు అధికారులు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నుంచి ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.105, మల్టీప్లెక్స్‌లలో రూ.132 పెంపునకు అనుమతి ఇచ్చింది. 12 నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.62, మల్టీప్లెక్స్‌లలో రూ.89 పెంపునకు అనుమతి ఇచ్చింది. టిక్కెట్ ద్వారా వచ్చే లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్‌కు ఇవ్వాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

'రాజాసాబ్' టిక్కెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో విజయ్ గోపాల్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా టిక్కెట్ల ధరల పెంపునకు అనుమతిస్తున్నారని న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. హోంశాఖ కార్యదర్శికి మెమో జారీ చేసే అధికారం లేదని ఆయన కోర్టుకు తెలిపారు. జిల్లాస్థాయి కలెక్టర్లు, హైదరాబాద్‌లో సీపీ మాత్రమే టిక్కెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
The Raja Saab
Prabhas
Telangana High Court
movie ticket prices
ticket price hike
cinema ticket rates

More Telugu News