Janga Krishnamurthy: టీటీడీలో అనూహ్య పరిణామం... బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా

Janga Krishnamurthy Resigns From TTD Board
  • మీడియా కథనాలతో మనస్తాపం చెందడమే కారణమని వెల్లడి
  • బాలాజీ నగర్ ప్లాట్ కేటాయింపు వివాదమే కారణం!
  • వాస్తవాలు తెలుసుకోకుండా కేబినెట్ నిర్ణయం తీసుకుందంటూ ఆవేదన
  • అవకాశం ఇచ్చిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన జంగా
పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యత్వానికి అనూహ్యంగా రాజీనామా చేశారు. తనపై మీడియాలో వచ్చిన తప్పుడు కథనాలతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఆయన టీటీడీకి రాజీనామా లేఖను సమర్పించడంతో పాటు, తన నిర్ణయానికి గల కారణాలను వివరిస్తూ మరో లేఖను విడుదల చేశారు.

తిరుమల బాలాజీ నగర్‌లోని ప్లాట్ నంబర్ 2 కేటాయింపు వివాదమే ఈ రాజీనామాకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. గతంలో తనకు కేటాయించి, ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ ప్లాట్‌ను తిరిగి కేటాయించాలని తాను ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్లు జంగా కృష్ణమూర్తి వివరించారు. సీఎం సూచన మేరకు ఈ అంశం బోర్డు ముందుకు రాగా, సభ్యులు ఆమోదిస్తూ తీర్మానం చేశారని తెలిపారు.

అయితే, ఈ వాస్తవాలను వక్రీకరించి మీడియాలో తన వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా కథనాలు ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, నిన్నటి కేబినెట్ సమావేశంలో వాస్తవాలు నిర్ధారించుకోకుండానే బోర్డు తీర్మానాన్ని రద్దు చేయాలని నిర్ణయించడం తనను తీవ్రంగా బాధించిందని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే పదవిలో కొనసాగలేనని స్పష్టం చేస్తూ జంగా రాజీనామా చేశారు.

శ్రీవారి సేవ చేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, టీటీడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సేవను కొనసాగించలేకపోతున్నందుకు స్వామివారికి క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. 
Janga Krishnamurthy
TTD
TTD Board
Chandrababu Naidu
Tirumala
Balaji Nagar
Andhra Pradesh Politics
Resignation
Plot Controversy
TDP Leader

More Telugu News