BTech Ravi: జగన్ రాయలసీమ బిడ్డ కాదు... అభివృద్ధిని అడ్డుకునే క్యాన్సర్ గడ్డ: బీటెక్ రవి ఫైర్

BTech Ravi Slams Jagan as Cancer to Rayalaseema Development
  • రాయలసీమ ప్రాజెక్టులన్నీ టీడీపీ హయాంలోనే రూపుదిద్దుకున్నాయన్న బీటెక్ రవి 
  • పులివెందుల మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టును జగన్ తన కమీషన్ల కోసం ఆపారని ఆరోపణ
  • రిషికొండ ప్యాలెస్‌పై ఉన్న శ్రద్ధ భోగాపురం ఎయిర్‌పోర్టుపై లేదని ఎద్దేవా
మాజీ ముఖ్యమంత్రి జగన్ రాయలసీమ బిడ్డ కాదని, ఆ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్న క్యాన్సర్ గడ్డ అని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత బీటెక్ రవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తామే ఒత్తిడి తెచ్చి ఆపామని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడాన్ని పట్టుకుని వైసీపీ నేతలు ఇప్పుడు గగ్గోలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వ అసమర్థత, కమీషన్ల కక్కుర్తి వల్లే రాయలసీమ ప్రాజెక్టులు కుంటుపడ్డాయని ఆరోపించారు.

"తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం వల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆగిపోయాయని అప్పటి మంత్రి హరీశ్ రావు స్వయంగా చెప్పారు. నిజంగా పక్క రాష్ట్రంపై అంత ప్రభావం ఉంటే, పోలవరం, మల్లన్న సాగర్ విషయంలో సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లారు? అక్కడ కూడా ఒత్తిడి తెచ్చి ఆపొచ్చు కదా?" అని రవి ప్రశ్నించారు. చట్టపరమైన అనుమతులు లేకుండా, కేవలం కమీషన్ల కోసం పనులు మొదలుపెట్టి, గ్రీన్ ట్రిబ్యూనల్ ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ. 2.60 కోట్ల జరిమానా పడేలా చేసింది జగన్ ప్రభుత్వమేనని ఆయన దుయ్యబట్టారు.

అభివృద్ధి చేసింది టీడీపీనే
"రాయలసీమలో ఏ ప్రాజెక్టు చూసినా అది తెలుగుదేశం పార్టీ పుణ్యమే. HNSS, GNSS వంటి బృహత్తర ప్రాజెక్టులకు రూపకల్పన చేసి శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ గారు. ఆయన గండికోట, RTPP వంటివి తీసుకురాకపోతే ఈ ప్రాంతం ఎడారిగా మిగిలేది. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు గండికోట ముంపు వాసులకు రూ. 475 కోట్ల ఆర్‌&ఆర్ ప్యాకేజీ ఇచ్చారు. ఆవుకు టన్నెల్ పనుల వద్ద స్వయంగా పడుకుని వాటిని పూర్తి చేయించి పులివెందులకు కృష్ణా జలాలు తెచ్చిన ఘనత ఆయనదే" అని రవి గుర్తుచేశారు. 

"పులివెందులకు నీళ్లు ఎవరి హయాంలో వచ్చాయో ఒకసారి ఆలోచించుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత.. 2009 నుండి 2014 వరకు రోశయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. అప్పట్లో జగన్ సొంత పార్టీ పెట్టే వరకు అంతా సజావుగానే ఉంది. కానీ, అధికారంలోకి వచ్చాక జగన్ తన అసమర్థతతో రాయలసీమ ప్రాజెక్టులను గోదావరిలో కలిపారు. 1978 నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న వైఎస్ కుటుంబం, పులివెందులకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోయింది" అంటూ బీటెక్ రవి ఎద్దేవా చేశారు. 

కమీషన్ల కోసమే ప్రాజెక్టుల విధ్వంసం
పులివెందుల నుంచి వేంపల్లి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన రూ. 1200 కోట్ల మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని రవి ఆరోపించారు. "పనులు చేస్తున్న మేఘా సంస్థకు బిల్లులు చెల్లించకుండా వేధించడంతో ఆ సంస్థ పనులు ఆపేసి వెళ్లిపోయింది. ఈ ప్రాజెక్టు పూర్తయి ఉంటే వేల ఎకరాలకు నీరందేది. కానీ కమీషన్లు రాని ఈ ప్రాజెక్టును జగన్ పట్టించుకోలేదు. అదే సమయంలో, ఎలాంటి అనుమతులు లేని పనులకు రూ. 950 కోట్లు చెల్లించి కమీషన్లు దండుకున్నారు," అని విమర్శించారు. కేసీ కెనాల్ నీరు రివర్స్ పారుతుందా అని అడిగిన వ్యక్తికి, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లిస్తే శ్రీశైలం జలాలు సీమకు వాడుకోవచ్చన్న లాజిక్ కూడా తెలియదని అన్నారు.

అవినాష్ రెడ్డి తీరుపై మండిపాటు
జిల్లా అభివృద్ధిపై సమీక్షించాల్సిన డీడీఆర్సీ సమావేశంలో, ఎంపీ అవినాష్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకంపై డిక్లరేషన్ ఇవ్వాలని కోరడం ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనమని రవి అన్నారు. "ఏ సమస్య ఎక్కడ మాట్లాడాలో తెలియని వ్యక్తి అవినాష్. జిల్లా మంత్రిని, కలెక్టర్‌ను నిలదీసే బదులు, మీ అన్న జగన్‌ను అసెంబ్లీకి పంపండి. అక్కడ మా ముఖ్యమంత్రి, జలవనరుల మంత్రి సమాధానం చెబుతారు," అని సవాల్ విసిరారు. ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం లేక సమావేశాన్ని బహిష్కరించి పారిపోయారని ఆరోపించారు.

రిషికొండ ప్యాలెస్ వర్సెస్ భోగాపురం
జగన్ ప్రాధాన్యతలు రాష్ట్ర అభివృద్ధికి కాకుండా వ్యక్తిగత సౌకర్యాలకే పరిమితమయ్యాయని రవి విమర్శించారు. "విశాఖలో తన కోసం నిర్మించుకున్న రిషికొండ ప్యాలెస్‌పై చూపిన శ్రద్ధలో 50 శాతం భోగాపురం ఎయిర్‌పోర్టుపై పెట్టినా అది ఎప్పుడో పూర్తయ్యేది. ఇప్పుడు దాని క్రెడిట్ కూడా తానే తీసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. కేవలం రాజకీయ కక్షతో అమరావతిని నాశనం చేసి రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. రాబోయే 20 ఏళ్ల మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి రాష్ట్ర పరువు తీశారు" అని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేసి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తుందని, ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతామని బీటెక్ రవి స్పష్టం చేశారు.
BTech Ravi
Jagan Mohan Reddy
Rayalaseema Lift Irrigation Scheme
TDP
Andhra Pradesh Projects
YS Avinash Reddy
Pulivendula
AP Politics
TDP vs YSRCP
Harish Rao

More Telugu News