MANUU: మౌలానా వర్సిటీ భూ వివాదం... తెలంగాణ ప్రభుత్వానికి విద్యార్థుల హెచ్చరిక

MANUU Land Row Students Warn Telangana Government
  • మౌలానా వర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని వెనక్కి తీసుకునే యత్నం
  • ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక
  • బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ను కలిసి మద్దతు కోరిన విద్యార్థులు
  • కాంగ్రెస్ ప్రభుత్వం 'సీరియల్ ల్యాండ్ గ్రాబర్' అంటూ కేటీఆర్ తీవ్ర విమర్శ
  • మైనారిటీ వర్సిటీ భూమిని కబ్జా చేస్తుంటే రాహుల్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్న
హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU)కి కేటాయించిన 50 ఎకరాల భూమిని వెనక్కి తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై వివాదం ముదురుతోంది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోకపోతే, తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం కొందరు విద్యార్థులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

గండిపేట మండలం, మణికొండలోని వర్సిటీ క్యాంపస్‌లో ఉన్న భూమిని కేటాయించిన ప్రయోజనాలకు వినియోగించడం లేదని, కాబట్టి దానిని ఎందుకు వెనక్కి తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులు ఇటీవల MANUU రిజిస్ట్రార్ ఇష్తియాక్ అహ్మద్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ప్రభుత్వ చర్య వర్సిటీ భవిష్యత్తుకు ముప్పు కలిగిస్తుందని విద్యార్థులు కేటీఆర్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన ప్రకటన తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఓ విద్యార్థి నాయకుడు ఆరోపించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సర్కారు 'సీరియల్ కిల్లర్' లాగా 'సీరియల్ ల్యాండ్ గ్రాబర్'గా మారిందని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే వర్సిటీ భూమిని అక్రమంగా చేజిక్కించుకోవాలని చూస్తోందని విమర్శించారు. తొలుత అగ్రికల్చర్ వర్సిటీ, ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను లాక్కోవాలని చూసిందని గుర్తుచేశారు.

దేశంలో మైనారిటీల రక్షకుడినని చెప్పుకునే రాహుల్ గాంధీ.. తెలంగాణలో మైనారిటీ వర్సిటీ భూమిని కబ్జా చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. "ఇదేనా మీ 'మొహబ్బత్ కీ దుకాణ్'?" అని నిలదీశారు. MANUU విద్యార్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, తాము తిరిగి అధికారంలోకి వచ్చాక వర్సిటీ విస్తరణకు అవసరమైన నిధులు కేటాయిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
MANUU
Maulana Azad National Urdu University
Telangana government
KTR
land dispute
Hyderabad
minority university
Congress
Rahul Gandhi
BRS

More Telugu News