Ponguleti Srinivasa Reddy: దమ్ముంటే ఖమ్మం జిల్లాలో పోటీ చెయ్: కేటీఆర్ కు పొంగులేటి సవాల్

Ponguleti Challenges KTR to Contest in Khammam
  • నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించిన కేటీఆర్
  • ఖమ్మం జిల్లాలో గెలవడం మీ నాన్న వల్లే కాలేదని ఎద్దేవా
  • మీ ఇంట్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని వ్యాఖ్య

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే ఖమ్మం జిల్లాలో పోటీ చేయాలని సవాల్ చేశారు. జిల్లా పర్యటనకు వచ్చి గొప్పలు చెప్పడం మానుకోవాలని చెప్పారు. కేటీఆర్ నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనపై పొంగులేటి స్పందిస్తూ కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలవడం మీ నాన్న తరం కాలేదు... నీ వల్ల ఏమవుతుందని అని అన్నారు. ముందు మీ ఇంట్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని ఎద్దేవా చేశారు. 


రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారని పొంగులేటి మండిపడ్డారు. ప్రభుత్వం జోలికి వస్తే కాంగ్రెస్ పార్టీ పవర్ ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. కేటీఆర్ మతి భ్రమించి రాహుల్ గాంధీ, గాంధీ కుటుంబంపై మాట్లాడుతున్నారని, సూర్యుడి పైకి ఉమ్మితే అది తిరిగి తన ముఖం మీదే పడుతుందని గమనించాలని అన్నారు. అవినీతి, దోపిడీలకు పేటెంట్‌గా ఉన్న కల్వకుంట్ల ఫ్యామిలీ గాంధీ కుటుంబం గురించి మాట్లాడటం సరికాదని మండిపడ్డారు.


జాతీయ నాయకుడిని విమర్శిస్తే తాను కూడా జాతీయ నాయకుడినవుతానని తాపత్రయపడటంలో తప్పులేదు కానీ ఆశకు హద్దు ఉండాలని అన్నారు. ఎన్నికల్లో వరుసగా దెబ్బలు తిన్నా బుద్ధి తెచ్చుకోకుండా అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "మీరు రెఫరెండం అని చెప్పిన ఎన్నికల్లోనే ప్రజలు గూబ గుయ్యిమనిపించారు. జూబ్లీహిల్స్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికలను సెమీ ఫైనల్స్ అంటున్నారు... దేనికి సెమీ ఫైనల్?" అంటూ ప్రశ్నించారు.

Ponguleti Srinivasa Reddy
KTR
BRS
Telangana Congress
Khammam district
Telangana politics
Rahul Gandhi
Kalvakuntla family
Telangana government
Assembly elections

More Telugu News