P Narayana: అమరావతిలో నేటి నుంచి రెండో దశ భూసమీకరణ

P Narayana Announces Second Phase of Land Pooling in Amaravati
  • ఇన్నర్ రింగ్ రోడ్డు, స్మార్ట్ సిటీ, రైల్వే బ్రిడ్జి నిర్మాణాల కోసం నేటి నుంచి భూ సమీకరణ ప్రారంభిస్తున్నామన్న మంత్రి నారాయణ 
  • సీఆర్‌డీఏలో కొత్తగా 754 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడి
  • ఏడుగురు మైనర్లకు ఫించన్ అందించేందుకు అథారిటీ  ఆమోదం లభించిందన్న మంత్రి నారాయణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని ప్రాంత అభివృద్ధి పనులకు మరింత వేగం పెంచింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, స్మార్ట్ సిటీ, రైల్వే బ్రిడ్జి నిర్మాణాల కోసం బుధవారం నుంచి భూ సమీకరణ ప్రారంభిస్తున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. ఎండ్రాయి, వడ్డమాను గ్రామాల నుంచి రెండో దశ భూ సమీకరణ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

అదేవిధంగా సీఆర్‌డీఏలో కొత్తగా 754 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. ఈ పోస్టులను కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, డిప్యుటేషన్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే తల్లిదండ్రులు లేని అనాథ మైనర్లకు నిబంధనలు సడలించి ఫించన్ మంజూరుకు అథారిటీ అనుమతి ఇచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఏడుగురు మైనర్లకు ఫించన్ అందించేందుకు అథారిటీ ఆమోదం లభించినట్లు స్పష్టం చేశారు.

రైతులు ప్రస్తావించిన రోడ్ హిట్ సమస్య పరిష్కారానికి నిర్ణయం తీసుకున్నామని, ఈ అంశంపై 112 ఫిర్యాదులు నమోదయ్యాయని మంత్రి వివరించారు. వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

ఇక అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా కృష్ణా నదిలో ఒక ఎకరా విస్తీర్ణంలో మెరీనా ఏర్పాటుకు సీఆర్‌డీఏ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అలాగే సీడ్ యాక్సిస్ రోడ్డుపై నాలుగున్నర ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. సమీకరించిన భూముల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. 
P Narayana
Amaravati
Andhra Pradesh
Land Pooling
CRDA
Inner Ring Road
Smart City
Railway Bridge
Real Estate
Capital Region Development Authority

More Telugu News