Chandrababu Naidu: రైతులకు భరోసా: తప్పుల్లేని కొత్త పాస్ పుస్తకాలే లక్ష్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

Chandrababu Naidu Focuses on Error Free Land Records for Farmers
  • గ్రామసభల్లో వివరాలు నిర్ధారించిన తర్వాతే పుస్తకాల ముద్రణ
  • ట్యాంపరింగ్‌కు తావులేకుండా అత్యున్నత సాంకేతికతతో రూపకల్పన
  • జనవరి 2 నుంచి ఇప్పటివరకు 6.07 లక్షల పాస్ పుస్తకాల పంపిణీ
  • రాజముద్ర, క్యూఆర్ కోడ్‌తో రైతు భూమికి ‘మీ భూమి-మీ హక్కు’ గ్యారెంటీ
రాష్ట్రంలోని రైతుల్లో భూ రికార్డులపై నమ్మకం, భరోసా కల్పించేలా కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియ సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం రెవెన్యూ శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్ది, పారదర్శకంగా భూ యజమానులకు హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

పాస్ పుస్తకాల ముద్రణలో ఎటువంటి పొరపాట్లకు తావుండకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో గ్రామసభలు నిర్వహించి, రైతుల నుంచి భూ వివరాలను సరిచూసుకున్న తర్వాతే తుది ముద్రణ చేపట్టాలని సూచించారు. కొత్త పుస్తకాలు ఎవరూ ట్యాంపర్ చేయలేకుండా, నకిలీలు సృష్టించే అవకాశం లేకుండా అత్యంత భద్రతా ప్రమాణాలతో రూపొందించినట్లు ఆయన తెలిపారు. భూ రికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయాలన్నా యజమాని అనుమతి తప్పనిసరి అని సీఎం స్పష్టం చేశారు.

భవిష్యత్తులో రెవెన్యూ శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, రైతులు తమకు కావాల్సిన పాస్ పుస్తకాలను ఆన్‌లైన్‌లోనే పొందేలా టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి వివరించారు. పాస్ పుస్తకాలపై రాజముద్ర, క్యూఆర్ కోడ్‌తో పాటు 'మీ భూమి-మీ హక్కు', 'జై భారత్ - జై తెలుగుతల్లి' అనే నినాదాలను ముద్రించాలని సూచించారు. ఇది కేవలం పుస్తకం మాత్రమే కాదని, రైతు భూమికి ప్రభుత్వం ఇచ్చే భరోసా అని ఆయన అభివర్ణించారు.

ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6.07 లక్షల పాస్ పుస్తకాలను రైతులకు నేరుగా అందజేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
AP CM
Andhra Pradesh
Land Records
Pattadar Passbooks
Farmers
Revenue Department
मी भूमि मी अधिकार
Jai Bharat Jai Telugu Talli
Land Rights

More Telugu News