సంక్రాంతి వేళ 8 వేలకు పైగా స్పెషల్ బస్సులు... ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం
- సంక్రాంతి సందర్భంగా 8,432 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించిన ఏపీఎస్ ఆర్‌టీసీ
- హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు 2,432 ప్రత్యేక బస్సులు
- ప్రత్యేక బస్సుల్లో కూడా సాధారణ ఛార్జీలనే వసూలు చేయనున్నామన్న ఆర్టీసీ
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు 2,432 ప్రత్యేక బస్సులు నడపనుండగా, మిగిలిన బస్సులను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు నడపనున్నట్లు వెల్లడించింది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా సాధారణ ఛార్జీలనే వసూలు చేయనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ స్పష్టం చేసింది.
తెలుగువారి అతి పెద్ద పండుగ సంక్రాంతి. తెలుగు రాష్ట్రాల్లో పండుగను మూడు రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఘనంగా జరుపుకుంటారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలు పండుగ శోభతో ముస్తాబవుతాయి. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపారాలతో స్థిరపడిన తెలుగువారు ఈ పండుగకు ప్రత్యేకంగా స్వగ్రామాలకు తరలివచ్చి కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వీరి కోసమే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.