Bob Blackman: పీవోకేని భారత్‌లో విలీనం చేయాలి: బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్ డిమాండ్
- పాక్ ఆక్రమించిన భాగాలు ఇండియాలో విలీనం కావాలన్న బ్లాక్‌మన్
- 1992లోనే ఆర్టికల్ 370ని రద్దు చేయాల్సి ఉందని వ్యాఖ్య
- పీవోకేలో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని మండిపాటు
బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ సీనియర్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ జమ్మూకశ్మీర్ విషయంలో భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జైపూర్‌లోని కాన్‌స్టిట్యూషనల్ క్లబ్‌లో జరిగిన హై-టీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, పాకిస్థాన్ జమ్మూ కశ్మీర్ నుంచి ఆక్రమించిన ప్రాంతాల (పీవోకే)ను భారత్‌లో విలీనం చేయాలని స్పష్టం చేశారు. గతంలోనూ పాకిస్థాన్ ఆక్రమణను వ్యతిరేకించానని, ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటానని ఆయన అన్నారు.
ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని కూడా ఆయన సమర్థించారు. దీన్ని ఇప్పుడు కాకుండా 1992లోనే చేపట్టాల్సిందని అభిప్రాయపడ్డారు. కశ్మీరీ పండితుల వలసల సమయంలోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని ఆయన పేర్కొన్నారు. పీవోకేలో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, ఇది సరైన చర్య కాదని హెచ్చరించారు.
గతేడాది పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన బ్లాక్‌మన్, ఆ దాడి తర్వాత భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'ను సమర్థించారు. కొన్నేళ్లుగా జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, శాంతి నెలకొన్నట్లు భావించానని, కానీ పహల్గాం దాడితో ఉగ్ర సమస్య మళ్లీ వెలుగులోకి వచ్చిందని ఆయన అన్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని విస్తరిస్తే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు దారి తీస్తుందని పాకిస్థాన్‌ను హెచ్చరించారు. బాబ్ బ్లాక్‌మన్ గతంలోనూ కశ్మీర్ విషయంలో భారత్ అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.