Botla Kanakarao: సారా వ్యాపారం చేస్తున్నారంటూ కుల బహిష్కరణ .. ఆత్మహత్య చేసుకుంటామంటూ బాధిత కుటుంబం సెల్ఫీ వీడియో

Botla Kanakarao Family Threatened with Suicide After Caste Ban in Eluru
  • ఏలూరు జిల్లా ముసునూరు మండలం లోపూడి గ్రామంలో ఘటన
  • ఇటీవలే కాపు సారా కేసులో జైలుకు వెళ్లి వచ్చిన బోట్ల కనకరావు
  • సారా విక్రయాలు చేయవద్దంటూ కుల పెద్దల హెచ్చరిక 
  • సామాజిక బహిష్కరణ వేటు వేసిన కులపెద్దలు
ఏలూరు జిల్లా ముసునూరు మండలం లోపూడి గ్రామంలో ఓ కుటుంబంపై విధించిన కుల బహిష్కరణ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. సారా విక్రయాలు నిలిపివేయాలని, లేదంటే రూ.లక్ష జరిమానా చెల్లించాలని కుల పెద్దలు ఆదేశించగా.. వాటిని ఖాతరు చేయలేదనే కారణంతో ఆ వ్యక్తితోపాటు అతని కుటుంబాన్ని సమాజం నుంచి వెలివేశారు. దీనికి మనస్తాపం చెందిన ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నామని సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది.
 
వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బోట్ల కనకరావు సారా విక్రయాలు చేస్తుండగా, ఎక్సైజ్‌ అధికారులు అతనిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన కనకరావుపై పది రోజుల క్రితం కుల పెద్దలు పంచాయితీ పెట్టి, ఇకపై సారా విక్రయాలు మానేయాలని, లేదంటే రూ.లక్ష జరిమానా విధిస్తామని హెచ్చరించారు. జరిమానా చెల్లించకపోతే కుల బహిష్కరణ తప్పదని స్పష్టం చేశారు.

ఈ ఆదేశాలను కనకరావు బేఖాతరు చేయడంతో ఆగ్రహించిన కుల పెద్దలు అతనితో పాటు అతని కుటుంబ సభ్యులను మోకాళ్లపై నిలబెట్టి కుల బహిష్కరణ విధించారు. ఈ నెల 3న గ్రామంలోని సామాజిక వర్గీయుల ఇళ్లకు వెళ్లిన కుల పెద్దలు, ఆ కుటుంబాన్ని వెలివేశామని, ఎవరూ వారితో మాట్లాడకూడదని హెచ్చరించినట్లు సమాచారం.


ఈ అవమానంతో తీవ్ర మనస్తాపానికి గురైన కనకరావు తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నామని చెబుతూ ఆదివారం సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తమ పరిస్థితికి కుల పెద్దలు సుదగాని రాంబాబు, చలమాల వెంకటేశ్వరరావు, ఆరేపల్లి నాగేశ్వరరావు, వీరంకి గంగరాజు, పంది శ్రీనివాసరావు, తాళం శ్రీరాములు కారణమని వీడియోలో పేర్కొన్నారు.

ప్రస్తుతం బాధిత కుటుంబం గ్రామంలో కనిపించకపోవడంతో ఆందోళన నెలకొంది. బాధితుడి తండ్రి బోట్ల నాగయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, పలువురు కుల పెద్దలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 
Botla Kanakarao
Eluru district
Musunuru Mandal
caste ban
suicide attempt
alcohol sales
village panchayat
Andhra Pradesh crime
police investigation
social boycott

More Telugu News