Asaduddin Owaisi: షేక్ హసీనాను కూడా వెనక్కు పంపేయండి: భారత్ తీరుపై ఒవైసీ ఫైర్

Asaduddin Owaisi Fires at India Over Double Standards on Bangladesh
  • క్రికెటర్ ముస్తాఫిజుర్‌ను పంపేసినప్పుడు, షేక్ హసీనాకు ఎందుకు ఆశ్రయం ఇచ్చారని ఒవైసీ ప్రశ్న
  • పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడలేదా? అని నిలదీత
  • బంగ్లాలో స్థిరత్వం భారత్‌కు ముఖ్యమని ఒవైసీ వ్యాఖ్యలు
ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై తీవ్ర విమర్శలు చేశారు. బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్, అదే దేశానికి చెందిన మాజీ ప్రధాని షేక్ హసీనా విషయంలో భారత్ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని ఆయన ఆరోపించారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల కారణంగా అక్కడి క్రికెటర్ ముస్తాఫిజుర్‌ను మ‌న ద‌గ్గ‌ర క్రికెట్ ఆడ‌కుండా చేసినప్పుడు, అదే దేశానికి చెందిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్‌లో ఎందుకు ఆశ్రయం ఇస్తున్నారని ఒవైసీ ప్రశ్నించారు. "బంగ్లాదేశ్‌కు చెందిన ఒక మహిళ (షేక్ హసీనా) భారత్‌లో ఉంటున్నారు. ఆమెను కూడా వెనక్కి పంపండి. ఆమెను ఎందుకు దేశంలో ఉంచుతున్నారు?" అని ఆయన నిలదీశారు.

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్థాన్ మూలాలున్న ఉగ్రవాదులు పర్యాటకులను చంపిన తర్వాత కూడా ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడిందని ఒవైసీ గుర్తుచేశారు. క్రీడలను, రాజకీయాలను కలపడంపై గతంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్ నుంచి ముస్తాఫిజుర్‌ను విడుదల చేయాలని షారుఖ్ ఖాన్ యాజమాన్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఫ్రాంచైజీని బీసీసీఐ ఇటీవల ఆదేశించింది. మరోవైపు, బంగ్లాదేశ్‌లో తీవ్ర వ్యతిరేకత మధ్య దేశం విడిచి వచ్చిన షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లోనే ఉంటున్నారు. ఆమెను తిరిగి పంపాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ, అక్కడ తనకు ప్రాణహాని ఉందని, విచారణ పేరుతో వేధిస్తారని ఆమె ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో స్థిరత్వం భారత్‌కు చాలా ముఖ్యమని, అక్కడ చైనా, పాకిస్థాన్ కార్యకలాపాలు చురుకుగా సాగుతున్న విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఒవైసీ సూచించారు.
Asaduddin Owaisi
AIMIM
Sheikh Hasina
Mustafizur Rahman
Bangladesh
India Foreign Policy
Kolkata Knight Riders
IPL 2026
Hindu Attacks Bangladesh
India Pakistan Asia Cup

More Telugu News