Mahesh Kumar Goud: బంగారు తెలంగాణను భ్రష్టు పట్టించారు: మహేశ్‌కుమార్‌గౌడ్

Mahesh Kumar Goud Slams KTR and BRS Rule in Telangana
  • కేటీఆర్‌వి అహంకారపూరిత వ్యాఖ్యలన్న టీపీసీసీ అధ్యక్షుడు 
  • బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉందని వెల్లడి
  • 8న గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం
బీఆర్‌ఎస్ నాయకత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బంగారు తెలంగాణను బీఆర్ఎస్ నేతలు భ్రష్టు పట్టించారని, కేటీఆర్ అహంకారం పరాకాష్టకు చేరిందని దుయ్యబట్టారు. నిరుద్యోగుల ఉసురు తగలడం వల్లే ఆ పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసిందని, ఇది తమ పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనమని మహేశ్‌గౌడ్ పేర్కొన్నారు. రెండేళ్ల ప్రజా పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని, అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించారని తెలిపారు. ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి బయటపడుతుందనే భయంతోనే బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ నుంచి పారిపోయారని, ఆ విషయాలను పక్కదారి పట్టించేందుకే కేటీఆర్ చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈనెల 8న గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మహేశ్‌గౌడ్ వెల్లడించారు. తన అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులు పాల్గొంటారని తెలిపారు. ఈ మేరకు ఆదివారం డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉపాధ్యక్షులతో నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో ఆయన వివరాలు వెల్లడించారు.
Mahesh Kumar Goud
Telangana
BRS
KTR
Congress Party
Revanth Reddy
TPCC
Telangana Politics
Gandhi Bhavan

More Telugu News