Pedda Harivanam: ఏ రాజకీయ నాయకుడు మా గ్రామానికి రావొద్దు... గ్రామస్తుల ప్రకటన.... ఎందుకంటే...!

Pedda Harivanam Villagers Ban Politicians Until Mandal Status Granted
  • తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని పెద్ద హరివాణం గ్రామస్తుల నిరసన
  • గత కొద్ది రోజులుగా రిలే దీక్షలు నిర్వహిస్తున్న గ్రామస్తులు 
  • తాజాగా ఏ రాజకీయ నాయకుడు మా గ్రామానికి రావద్దు అంటూ బోర్డు ఏర్పాటు చేసిన వైనం
కర్నూలు జిల్లా, ఆదోని -2 మండలంలోని పెద్ద హరివాణం గ్రామస్తులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించేంత వరకు ఏ రాజకీయ నాయకుడినీ గ్రామంలో అడుగు పెట్టనివ్వకూడదని గ్రామస్తులంతా తీర్మానించారు. ఈ మేరకు ఆదివారం గ్రామ సరిహద్దులో బోర్డును ఏర్పాటు చేసి తమ నిరసనను తెలియజేశారు.
 
రాష్ట్రంలోనే అతిపెద్ద మండలమైన ఆదోని మండలాన్ని నాలుగు మండలాలుగా విభజించాలని గత సంవత్సరం నుండి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. శాసనసభలో ఈ అంశంపై ప్రస్తావించారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా పెద్ద హరివాణం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ గ్రామస్థులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.
 
అయితే, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదోని మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తూ ఆదోని, పెద్ద హరివాణం మండలాలుగా ప్రకటించింది. ఇందులో ఆదోని మండలంలో 24 గ్రామాలు, పెద్ద హరివాణం మండలంలో 22 గ్రామాలను కేటాయించింది. అయితే 16 గ్రామాల ప్రజలు .. పెద్ద హరివాణం మండల కేంద్రంలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ దీక్షలు చేయడంతో ప్రభుత్వం వెనకడుగు వేసి పెద్ద హరివాణం మండలం కాకుండా ఆదోని - 1, ఆదోనీ -2 మండలంగా ప్రకటించింది. 

ఈ నిర్ణయంపై పెద్ద హరివాణం గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గత వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆందోళనలో భాగంగా ఆదివారం గ్రామానికి చెందిన పలువురు మండల కేంద్రం ఏర్పాటు కోసం నిరాహార దీక్ష చేపట్టారు. 

ఈ సందర్భంగా మండల సాధన కమిటీ అధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి, మధులు మాట్లాడుతూ.. తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించి గెటిజ్ నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు ఆదోని - 1, ఆదోనీ -2 మండలాలుగా ప్రకటించడం దారుణమన్నారు. నాయకులు తమను, తమ గ్రామాన్ని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఏ పార్టీ రాజకీయ నాయకులు తమ గ్రామంలోకి రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. తిరిగి మండల కేంద్రంగా ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని పేర్కొన్నారు. 
Pedda Harivanam
Kurnool district
Adoni constituency
Mandal center
Political leaders ban
Village protest
Andhra Pradesh politics
Partasarathi MLA
Adoni mandal

More Telugu News