Maoists: ప్రభుత్వ డెడ్‌లైన్‌కు మావోయిస్టుల ‘రివర్స్’ వ్యూహం

Maoists New Strategy to Counter Government Deadline
  • మనుగడ చాటుకునేందుకు సరికొత్త ఎత్తుగడలు
  • ‘ఆపరేషన్ కగార్’ నుంచి దళాలను కాపాడుకునే యత్నం
  • సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అగ్రనాయకత్వం ఆదేశం 
  • తెలంగాణ కీలక నేతలు లొంగుబాటుకు విముఖత
  • కొద్దిమంది సభ్యులతోనే కదులుతున్న దళాలు
దేశంలో మావోయిస్టుల నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం విధించిన మార్చి 31 గడువు సమీపిస్తుండటంతో అటవీ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే, పాలకుల లక్ష్యం నెరవేరలేదని నిరూపించేందుకు మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత కూడా తమ ఉనికిని చాటుకోవడం ద్వారా ప్రభుత్వానికి సవాల్ విసరాలని మావోయిస్టులు భావిస్తున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది.

భద్రతా బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ అడవులను జల్లెడ పడుతుండటంతో, దళాలను కాపాడుకోవడం పార్టీకి సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఊహించని సరికొత్త ప్రాంతాలకు, అవసరమైతే మైదాన ప్రాంతాలకు వెళ్లి నమ్మకస్తుల సాయంతో తలదాచుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించినట్లు సమాచారం. డెడ్‌లైన్ దాటిన తర్వాత మళ్లీ వెలుగులోకి వచ్చి, తమను నిర్మూలించడం అసాధ్యమని చాటిచెప్పడమే ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.

తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో మిగిలి ఉన్న కొద్దిపాటి దళాలు ప్రస్తుతం సురక్షిత స్థావరాల వేటలో ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణకు చెందిన 17 మంది మావోయిస్టుల్లో ఎనిమిది మంది కీలక బాధ్యతల్లో ఉన్నారు. కొత్త సారథిగా భావిస్తున్న తిప్పిరి తిరుపతితో పాటు బడే చొక్కారావు, ముప్పిడి సాంబయ్య వంటి నేతల నాయకత్వంలో దళాలు కదులుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో అతి తక్కువ మంది సభ్యులతోనే ఈ నేతలు రాకపోకలు సాగిస్తున్నట్లు సమాచారం.

కేంద్ర కమిటీలోని తెలంగాణ నేతలు లొంగుబాటుకు సిద్ధంగా లేరని తెలుస్తున్నప్పటికీ కింది స్థాయి కేడర్‌లో మార్పు కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చి లొంగిపోయినా ఆహ్వానిస్తామని తెలంగాణ పోలీసులు ప్రకటించడంతో కొందరు లొంగుబాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన డీజీపీల సమావేశంలో కూడా ఈ పరిణామాలపై లోతుగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద, మార్చి 31 లక్ష్యంగా అటు కేంద్రం, ఇటు మావోయిస్టుల మధ్య మైండ్ గేమ్ ఉత్కంఠగా మారుతోంది.
Maoists
Maoist Party
Naxalites
Chhattisgarh
Telangana
Maharashtra
Operation Kagar
Naxal Movement
Insurgency
Left Wing Extremism

More Telugu News