Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మాన్ వెనక్కి.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం!

Mustafizur Rahman Returns From Kolkata Bangladesh Cricket Board Decision
  • టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌ల వేదికలను మార్చాలంటున్న బంగ్లాదేశ్
  • భద్రతను దృష్టిలో ఉంచుకుని వేదికలు మార్చాలని ఐసీసీకి విజ్ఞప్తి చేయనున్నట్లు వెల్లడి
  • ముస్తాఫిజుర్‌ను రిలీజ్ చేయడంపై స్పందించబోనన్న క్రికెట్ బోర్డు అధికారి
తమ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి విడుదల చేయడంతో బంగ్లాదేశ్ క్రికెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. టీ20 ప్రపంచ కప్‌ను భారత్ వేదికగా ఆడేందుకు బంగ్లాదేశ్ అంత సుముఖంగా లేదని తెలుస్తోంది. ఈ మేరకు భారత్‌లో బంగ్లాదేశ్ జట్టు ఆడే మ్యాచ్‌ల వేదికలను మార్చాలని ఐసీసీని సంప్రదించాలని భావిస్తోంది.

గత కొద్ది కాలంగా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని వేదికలను మార్చాలని ఐసీసీ దృష్టికి తీసుకువెళతామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

కోల్‌కతా జట్టు నుంచి ముస్తాఫిజుర్‌ను విడుదల చేయడంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే ఐపీఎల్ వారి అంతర్గత విషయమని వెల్లడించారు. ప్రపంచ కప్‌లో పాల్గొనే అంశం మాత్రం ఐసీసీ ఈవెంట్ కాబట్టి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చర్చిస్తుందని అన్నారు.

2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు వెళ్ళి మ్యాచ్ ఆడేందుకు బీసీసీఐ నిరాకరించిందని గుర్తు చేశారు. కాబట్టి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని అన్నారు.

ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. గ్రూప్ స్టేజ్‌లో బంగ్లాదేశ్ ఆడాల్సిన నాలుగు మ్యాచ్‌లను భారత్‌లోనే షెడ్యూల్ చేశారు. ఈడెన్ గార్డెన్స్‌లో ఫిబ్రవరి 7న వెస్టిండీస్, 9న ఇటలీ, 14న ఇంగ్లాండ్, 17న వాంఖెడే స్టేడియంలో నేపాల్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
Mustafizur Rahman
Bangladesh Cricket Board
T20 World Cup
Kolkata Knight Riders
India
ICC

More Telugu News