Pawan Kalyan: కొండగట్టులో ప్రమాదాన్ని గుర్తించి జాగ్రత్తపడిన పవన్ కల్యాణ్... వీడియో ఇదిగో!

Pawan Kalyan Averts Accident During Kondagattu Visit
  • కొండగట్టు పర్యటనలో పవన్‌కు తప్పిన విద్యుత్ ప్రమాదం
  • అభిమానులకు అభివాదం చేస్తుండగా అడ్డువచ్చిన వైర్లు
  • కారుపై పడుకుని చాకచక్యంగా తప్పించుకున్న పవన్ కల్యాణ్
  • అంజన్న దయవల్లే ప్రమాదం నుంచి బయటపడ్డానన్న జనసేనాని
  • ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తానని హామీ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టులో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ప్రమాదాన్ని గుర్తించి జాగ్రత్తపడ్డారు. అభిమానులకు అభివాదం చేసేందుకు కారు పైకి ఎక్కగా, విద్యుత్ వైర్లు అడ్డురావడంతో ఆయన సమయస్ఫూర్తితో వ్యవహరించి సురక్షితంగా తప్పించుకున్నారు.

వివరాల్లోకి వెళితే, శనివారం ఉదయం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం పవన్, ఓ ప్రైవేట్ రిసార్ట్ నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేసేందుకు ఆయన తన కారు పైకి ఎక్కారు. అదే సమయంలో అక్కడున్న సర్వీస్ విద్యుత్ వైర్లు ఆయనకు అతి సమీపంలోకి వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను హెచ్చరించగా, పవన్ చాకచక్యంగా కారు పైనే పడుకున్నారు. దీంతో వైర్లు ఆయన పైనుంచి వెళ్లిపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో అభిమానులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

అనంతరం పవన్ మాట్లాడుతూ, "కొండగట్టు అంజన్న అంటే నాకు ప్రత్యేక సెంటిమెంట్. స్వామివారి ఆశీస్సులతోనే ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాను" అని వ్యాఖ్యానించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సాయం అందిస్తానని, ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సహకరిస్తున్నారని తెలిపారు. గతంలో తాను వచ్చినప్పుడు వసతి గృహాల నిర్మాణం కోసం కోరగా, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సహకారంతో నిధులు ఇప్పించిన విషయాన్ని గుర్తుచేశారు. అంజన్న ఆశీస్సులతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
Pawan Kalyan
Kondagattu
Jagtial
Telangana
Janasena
Revanth Reddy
Kondagattu Anjaneya Swamy Temple
Accident
Political Rally
Power Lines

More Telugu News