Forest Officials: రూ.3.51 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఫారెస్ట్ అధికారి

Forest Officials Caught Taking Bribe in Bhadradri Kothagudem
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీకి చిక్కిన అధికారి, మరో వ్యక్తి
  • బిల్లులు చెల్లించేందుకు లంచం అడిగిన డివిజనల్ మేనేజర్
  • పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగి పట్టుకున్న ఏసీబీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ శాఖ అధికారి, మరొక వ్యక్తి రూ. 3.51 లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. జామాయిల్ కటింగ్‌ పనులకు సంబంధించిన బిల్లులు చెల్లింపు కోసం అధికారులు లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది. దీంతో ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు.

కొత్తగూడెం అటవీ సబ్-డివిజన్ ప్లాంటేషన్ మేనేజర్ తాడి రాజేందర్, ప్రయివేటు వ్యక్తి చెన్నం గోపాలకృష్ణలను ఏసీబీ పట్టుకుంది. ఓ వ్యక్తి సుమారు 3,900 టన్నుల నీలగిరి చెట్లను నరికివేయడానికి కావాల్సిన బిల్లుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఇందుకోసం కొత్తగూడెం ఫారెస్ట్ డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణి రూ.3.51 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

ఏసీబీ అధికారులు ప్రణాళికతో వ్యవహరించి రాజేందర్, గోపాలకృష్ణలను అరెస్టు చేశారు. ప్రధాన నిందితురాలు తాటి శ్రావణి పరారీలో ఉన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఏసీబీ ప్రజలకు సూచించింది. అలాగే వాట్సాప్ (నంబర్ 9440446106), ఫేస్‌బుక్ (తెలంగాణ ఏసీబీ), ఎక్స్ ఖాతా @TelanganaACB ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ పేర్కొంది.
Forest Officials
Bhadradri Kothagudem
Telangana ACB
Bribery Case
T Rajender
Chennarao
Corruption

More Telugu News