KCR: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇస్తారని భావించాను: సభలో రేవంత్ రెడ్డి

Revanth Reddy Expected KCR to Give Advice in Assembly
  • కేసీఆర్ నదీ జలాల గురించి మాట్లాడారన్న ముఖ్యమంత్రి
  • ఆయన చెప్పినందువల్లే నదీ జలాల అంశాన్ని చర్చకు పెట్టామని వెల్లడి
  • రెండేళ్లుగా కేసీఆర్ సభకు రాకపోవడం విచారకరమని వ్యాఖ్య
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నదీ జలాల గురించి మాట్లాడితే, ఆయన సభకు వచ్చి రాష్ట్రానికి ఉపయోగపడే సలహాలు ఇస్తారని భావించానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నదీ జలాలపై కేసీఆర్ మాట్లాడిన వెంటనే అసెంబ్లీలో చర్చకు పెట్టామని, కానీ ఆయన మాత్రం సభకు రాలేదని అన్నారు. శాసనసభలో 'నీళ్లు-నిజాలు'పై జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.

కృష్ణా నది ప్రాజెక్టులపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, గత పదేళ్లలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరిగిందని తెలిపారు. అందుకే అనుభవం కలిగిన నాయకుడిగా కేసీఆర్ సభకు వచ్చి సలహాలు, సూచనలు చేస్తారని భావించానని అన్నారు. బయట సభల్లో, కార్యాలయాల్లో మాట్లాడే మాటల కంటే అసెంబ్లీలో మాట్లాడే మాటలకు విలువ ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

రెండేళ్లుగా ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోవడం విచారకరమని ఆయన అన్నారు. గతంలో బీఆర్ఎస్ నేతలు అవమానించినా కాంగ్రెస్ నేతలు సభకు వచ్చి మాట్లాడేవారని తెలిపారు. ప్రతిపక్ష నేతలు అసెంబ్లీలో మాట్లాడకపోతే అంతిమంగా ప్రజలకే అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. కృష్ణా జలాలపై చర్చను తెరపైకి తెచ్చిందే కేసీఆర్ అని గుర్తుచేశారు. కానీ ఆయనకు చట్టసభలంటే చిన్నచూపు అని విమర్శించారు.
KCR
KCR Telangana
Revanth Reddy
Telangana Assembly
Krishna River
River Waters Dispute

More Telugu News