HYDRA Hyderabad: రూ.35 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

HYDRA Saves Land Worth 35 Crore in Hyderabad
  • కూకట్‌పల్లిలో కబ్జాదారుల నుంచి 3 వేల గజాల భూమిని కాపాడిన హైడ్రా
  • స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు
  • రెండు పార్కుల చుట్టూ ఫెన్సింగ్, బోర్డుల ఏర్పాటు
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో కబ్జాకు గురైన సుమారు రూ. 35 కోట్ల విలువైన పార్కు స్థలాలను హైడ్రా అధికారులు కాపాడారు. మొత్తం 3 వేల గజాల విస్తీర్ణంలో ఉన్న రెండు పార్కుల స్థలాలను శనివారం స్వాధీనం చేసుకుని, వాటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

కూకట్‌పల్లి భాగ్యనగర్ ఫేజ్–3 కాలనీలోని పార్కులు ఆక్రమణకు గురయ్యాయని అక్కడి సంక్షేమ సంఘం సభ్యులు 'ప్రజావాణి'లో హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ఆక్రమణలను నిర్ధారించుకున్న తర్వాత ఈ చర్యలు చేపట్టారు.

సర్వే నంబర్లు 197, 200 పరిధిలో 1987లో హుడా అనుమతితో భాగ్యనగర్ ఫేజ్-3 లేఅవుట్ ఏర్పడింది. ఇందులో రెండు స్థలాలను పార్కుల కోసం కేటాయించారు. అయితే, 2 వేల గజాల పార్కులో సగం స్థలం, ఎకరం విస్తీర్ణంలోని మరో పార్కులో వెయ్యి గజాల స్థలం కబ్జాకు గురైనట్లు అధికారులు తమ నివేదికలో గుర్తించారు.

ఈ నివేదిక ఆధారంగా కమిషనర్ ఆదేశాలతో శనివారం ఆక్రమణలను తొలగించారు. ఖాళీ చేయించిన స్థలంలో 'హైడ్రా' బోర్డులను ఏర్పాటు చేసి, ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించారు. తమ కాలనీలోని విలువైన పార్కు స్థలాలను కాపాడినందుకు స్థానికులు హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
HYDRA Hyderabad
Hyderabad
Kukatpally
Land Grabbing
Bhagyanagar Phase 3
Park Land
AV Ranganath
Telangana News
Real Estate

More Telugu News