Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ వచ్చేస్తోంది.. తొలి సర్వీసు గౌహతి - హౌరా మధ్య.. ధరలు, ఫీచర్లు ఇవే!

Vande Bharat Sleeper Train Details
  • జనవరిలో పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు
  • గౌహతి - హౌరా మధ్య నడవనున్న మొదటి సర్వీసు
  • విజయవంతంగా పూర్తయిన అన్ని ట్రయల్స్, భద్రతా పరీక్షలు
  • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
  • విమాన ఛార్జీల కన్నా తక్కువగా ఉండనున్న టికెట్ ధరలు
భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక అధ్యాయం మొదలుకానుంది. దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు సేవలు ఈ జనవరిలోనే ప్రారంభం కానున్నాయి. మొదటి సర్వీసును అసోంలోని గౌహతి, పశ్చిమ బెంగాల్‌లోని హౌరా (కోల్‌కతా) మధ్య నడపనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు. అన్ని రకాల ట్రయల్స్, భద్రతా పరీక్షలు విజయవంతంగా పూర్తి కావడంతో, త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.

ఈ రైలు తయారీకి సంబంధించిన అన్ని పరీక్షలు, ముఖ్యంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నిర్వహించిన హై-స్పీడ్ ట్రయల్స్ కూడా విజయవంతంగా పూర్తయ్యాయి. కోటా-నాగ్డా సెక్షన్‌లో కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (CRS) పర్యవేక్షణలో జరిగిన తుది పరీక్షల తర్వాత ఈ రైలుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో జనవరి ద్వితీయార్ధంలో, రాబోయే 15-20 రోజుల్లోనే ఈ రైలు పట్టాలెక్కేందుకు మార్గం సుగమమైంది.

రైలు ప్రత్యేకతలు, సామర్థ్యం

వందే భారత్ స్లీపర్ రైలును సుదూర రాత్రి ప్రయాణాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. మొత్తం 16 కోచ్‌లు ఉండే ఈ రైలులో 11 ఏసీ 3-టైర్, 4 ఏసీ 2-టైర్, 1 ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ఉంటాయి. మొత్తంగా ఒకేసారి 823 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు. ప్రయాణంలో కుదుపులు, శబ్దాలు తగ్గించేందుకు అధునాతన సస్పెన్షన్ టెక్నాలజీని ఉపయోగించారు.

ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి బెర్త్ వద్ద కుషన్లు, రీడింగ్ లైట్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, మొబైల్ హోల్డర్, ఫోల్డబుల్ స్నాక్ టేబుల్ వంటివి ఏర్పాటు చేశారు. ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్‌లో వేడి నీటితో కూడిన షవర్ క్యూబికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. భద్రత కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన 'కవచ్' యాంటీ-కొలిజన్ సిస్టమ్, సీసీటీవీ కెమెరాలు, అడ్వాన్స్‌డ్ ఫైర్ డిటెక్షన్ వ్యవస్థలను అమర్చారు.

టికెట్ ధరలు ఎలా ఉండనున్నాయి?

ఈ రైలులో ప్రయాణ ఛార్జీలు విమాన టికెట్ల కన్నా గణనీయంగా తక్కువగా ఉంటాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. కళింగ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "ఈ రైలులో డైనమిక్ ప్రైసింగ్ విధానం ఉండదు. గౌహతి - కోల్‌కతా మార్గంలో ఏసీ 3-టైర్ టికెట్ ధర సుమారుగా రూ. 2,300, ఏసీ 2-టైర్ ధర రూ. 3,000, ఏసీ ఫస్ట్ క్లాస్ ధర రూ. 3,600గా ఉంటుంది" అని తెలిపారు.

"వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం భారతీయ రైల్వే, దేశం, రైలు ప్రయాణికుల కోసం ఒక ముఖ్యమైన మైలురాయి. 2026 సంవత్సరం భారతీయ రైల్వేలో ప్రధాన సంస్కరణల సంవత్సరంగా నిలుస్తుంది" అని ప్రభుత్వం పేర్కొంది. బెంగళూరుకు చెందిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML), ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) భాగస్వామ్యంతో ఈ రైళ్లను తయారు చేస్తున్నాయి. రాబోయే ఆరు నెలల్లో మరో 8 స్లీపర్ రైళ్లను, 2026 చివరి నాటికి మొత్తం 12 రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
Vande Bharat Sleeper
Ashwini Vaishnaw
Indian Railways
Guwahati Howrah
Sleeper Train
BEML
ICF
Kalinga TV
Narendra Modi
AC First Class

More Telugu News