Indian Origin Cab Driver: కెనడాలో భారత డ్రైవర్ సాహసం... గడ్డకట్టించే చలిలో ఓ గర్బిణి ప్రసవానికి సాయం

Indian Origin Cab Driver Picks Up Two Passengers Drops 3 To Hospital
  • గర్భిణీని ఆసుపత్రికి తీసుకెళుతుండగా క్యాబ్‌లోనే ప్రసవం
  • తీవ్రమైన మంచు, ప్రతికూల వాతావరణంలో డ్రైవింగ్
  • ఇద్దరు ప్రయాణికులు ఎక్కితే, ముగ్గురు సురక్షితంగా దిగిన వైనం
  • తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపిన సిబ్బంది
కెనడాలో భారత సంతతికి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి, తీవ్రమైన చలిలో గర్భిణీ ప్రసవానికి సహాయపడ్డాడు. ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకున్న ఆ క్యాబ్ డ్రైవర్, ఆసుపత్రికి చేరేలోపే కారులో జన్మించిన శిశువుతో సహా ముగ్గురిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాడు. ఈ సంఘటన కాల్గరీ నగరంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... కాల్గరీలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న హర్దీప్ సింగ్ తూర్‌కు గత శనివారం రాత్రి ఆసుపత్రికి అత్యవసరంగా వెళ్లాలని ఓ కాల్ వచ్చింది. అతడు అక్కడికి చేరుకునేసరికి, నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ, ఆమె భర్త కనిపించారు. వారి పరిస్థితి చూసి, అంబులెన్స్ కోసం పిలిచేంత సమయం లేదని హర్దీప్ గ్రహించాడు. ఆ సమయంలో బయట ఉష్ణోగ్రత -23°Cగా ఉండటం, మంచుతో కూడిన తుపాను, జారుతున్న రోడ్ల కారణంగా తనే వేగంగా ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

ఆ 30 నిమిషాల ప్రయాణం ఎంతో ఒత్తిడితో గడిచిందని హర్దీప్ తెలిపారు. వెనుక సీట్లో గర్భిణీ నొప్పులతో కేకలు వేస్తుండగా, ట్రాఫిక్ సిగ్నల్స్ తన సహనాన్ని పరీక్షించాయని చెప్పాడు. పీటర్ లౌఘీడ్ సెంటర్ ఆసుపత్రికి కొన్ని బ్లాకుల దూరంలో ఉండగా, వెనుక నుంచి అరుపులు ఆగిపోయాయి. అప్పటికే కారులోనే శిశువు జన్మించింది. అయినా హర్దీప్ కారు ఆపకుండా నేరుగా ఆసుపత్రి వద్దకు తీసుకెళ్లాడు.

అక్కడ సిద్ధంగా ఉన్న సిబ్బంది వెంటనే పరుగున వచ్చి తల్లీబిడ్డను లోపలికి తీసుకెళ్లారు. వారిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్య సిబ్బంది తనకు తెలిపారని హర్దీప్ సింగ్ చెప్పాడు. "గత నాలుగేళ్లుగా క్యాబ్ నడుపుతున్నాను. ఇద్దరిని ఎక్కించుకుని, ముగ్గురిని సురక్షితంగా దించడం ఇదే మొదటి అనుభవం. ఇది నాకు గర్వకారణమైన క్షణం" అని ఆనందం వ్యక్తం చేశాడు.
Indian Origin Cab Driver
Hardeep Singh Toor
Canada
cab driver
Calgary
pregnancy
delivery
hospital
snowstorm
Peter Lougheed Centre

More Telugu News