Sajjanar: బతికి గెలవాలి: కన్నవారే పిల్లలకు విషమిచ్చి చంపడంపై సజ్జనార్ స్పందన

Sajjanar on Parents Killing Children urges to Live and Win
  • క్షణికావేశంలో నూరెళ్ల జీవితాన్ని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్న సజ్జనార్
  • గోరుముద్దలు తినిపించాల్సిన చేతులే విషం కలిపాయని ఆవేదన
  • గుండెలకు హత్తుకోవాల్సిన వారే ఊపిరి తీశారని ఆందోళన
బతికి గెలవాలని, పారిపోయి ఓడిపోవద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ 'ఎక్స్' వేదికగా సూచించారు. పిల్లలను పెంచలేక కన్నవారే వారికి విషమిచ్చి చంపిన ఘటనలకు సంబంధించిన రెండు వార్తా క్లిప్పింగ్‌లను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. క్షణికావేశంలో నూరేళ్ల జీవితాన్ని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. "దయచేసి ఆలోచించండి" అని విజ్ఞప్తి చేశారు.

"నూతన సంవత్సర వెలుగులు చూడాల్సిన కళ్లు శాశ్వతంగా మూసుకుపోయాయి. గోరుముద్దలు తినిపించాల్సిన చేతులే విషం కలిపాయి. గుండెలకు హత్తుకోవాల్సిన వారే ఊపిరి తీశారు. అమృతం లాంటి ప్రేమను పంచాల్సిన తల్లిదండ్రులే ఇలా మారితే ఆ పసిప్రాణాలు ఎవరికి చెప్పుకోగలవు? నాన్న ఇచ్చిన పాలలో విషం ఉందని ఆ చిన్నారులకు ఏం తెలుసు? అమ్మ కొంగు ఉరితాడవుతుందని ఆ అమాయకులకు ఏం ఎరుక? కష్టాలు సునామీలా వచ్చినా సరే ఎదురీదాలే తప్ప, ఇలా పసిమొగ్గలను చిదిమేయడం పిరికితనం, పాపం, క్షమించరాని నేరం" అని ఆయన పేర్కొన్నారు.

చనిపోవడానికి ఉన్న ధైర్యం బ్రతకడానికి, పోరాడటానికి ఎందుకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని, అది మీపై ఆధారపడ్డ వారికి తీరని ద్రోహమవుతుందని పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఓ మహిళ తన భర్త మృతితో పిల్లల్ని పోషించలేక వారికి విషమిచ్చి, తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో కుమార్తె మృతి చెందగా, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఘటనలో నంద్యాల జిల్లాలో తన ముగ్గురు పిల్లలకు ఓ తండ్రి విషమిచ్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలను పంచుకుంటూ ఆయన ట్వీట్ చేశారు.
Sajjanar
Hyderabad CP
Suicide Prevention
Child Suicide
Parental Suicide
Nagar Kurnool
Nandyala District

More Telugu News