Gig Workers: దేశంలో కొత్త కార్మిక చట్టాలు... ఇక గిగ్ వర్కర్లకూ ఉద్యోగ భద్రత

Gig Workers Get Job Security Under New Labour Laws in India
  • కొత్త కార్మిక చట్టాలపై ముసాయిదా నిబంధనలు విడుదల చేసిన కేంద్రం
  • గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు తొలిసారిగా సామాజిక భద్రత కల్పన
  • ప్రయోజనాల కోసం కనీస పని దినాల అర్హత నిబంధనలు వెల్లడి
  • అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనం, నియామక పత్రాలు తప్పనిసరి
  • ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలుకు ప్రభుత్వ సన్నాహాలు
దేశంలోని కార్మిక రంగంలో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాలుగు కొత్త కార్మిక చట్టాలకు (లేబర్ కోడ్స్) సంబంధించిన ముసాయిదా నిబంధనలను కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ కొత్త విధానం ద్వారా తొలిసారిగా గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లను (ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ, క్యాబ్ డ్రైవర్లు వంటివారు) కూడా సామాజిక భద్రత పరిధిలోకి తీసుకువస్తున్నారు. వారికి కనీస వేతనం, ఆరోగ్యం, వృత్తి భద్రత వంటి ప్రయోజనాలు అందనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త చట్టాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ముసాయిదా నిబంధనల ప్రకారం.. ఈ ప్రయోజనాలు పొందాలంటే గిగ్ వర్కర్లు కొన్ని షరతులను పాటించాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే సంస్థ (అగ్రిగేటర్)తో కనీసం 90 రోజులు పనిచేసిన వారు సామాజిక భద్రత పథకాలకు అర్హులవుతారు. ఒకటి కంటే ఎక్కువ సంస్థలతో పనిచేసే వారికి ఈ పరిమితిని 120 రోజులుగా నిర్ణయించారు. ఒకే రోజులో ఒక వర్కర్ వేర్వేరు సంస్థల కోసం పనిచేస్తే, ఆ పనిదినాలను వేర్వేరుగా లెక్కిస్తారు. ఉదాహరణకు ఒకే రోజు ముగ్గురు అగ్రిగేటర్లతో పనిచేస్తే, దానిని మూడు పని దినాలుగా పరిగణిస్తారు.

ఈ కొత్త చట్టాల ద్వారా మరికొన్ని ముఖ్యమైన మార్పులు కూడా రానున్నాయి. ఇకపై అన్ని రంగాల ఉద్యోగులకు యాజమాన్యాలు తప్పనిసరిగా నియామక పత్రాలు (అపాయింట్‌మెంట్ లెటర్లు) ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల ఉద్యోగ భద్రత, పారదర్శకత పెరుగుతాయి. అలాగే ఇప్పటివరకు కొన్ని నిర్దిష్ఠ‌ పరిశ్రమలకే పరిమితమైన కనీస వేతనం, ఇకపై అన్ని రంగాల కార్మికులకు చట్టబద్ధంగా వర్తిస్తుంది.

అధిక వేతనాలు, మెరుగైన పని పరిస్థితులు కోరుతూ గిగ్ వర్కర్లు సమ్మెకు దిగడానికి ఒక రోజు ముందు, అంటే 2025 డిసెంబర్ 30న ఈ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ ముసాయిదాపై భాగస్వామ్య పక్షాల నుంచి కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాలను స్వీకరిస్తోంది.
Gig Workers
Labor Codes
New Labour Laws India
Social Security
Platform Workers
Minimum Wages
Job Security
Labour Reforms
Gig Economy India

More Telugu News