Indian Railways: 9 కిలోమీటర్ల ప్రయాణానికి రెండున్నర గంటలు.. రైలు ప్రయాణికుల ఆందోళన

Indian Railways 25 Hours for 9 km Journey Passengers Protest
  • బీహార్‌లోని సమస్తిపూర్–బరౌనీ రైల్వే సెక్షన్‌లో కొత్తగా ఆటోమెటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ
  • అందులో లోపం కారణంగా గంటల తరబడి నిలిచిపోయిన రైళ్లు
  • ఆందోళనకు దిగిన ప్రయాణికులు.. సిబ్బందితో వాగ్వివాదం
  • దిద్దుబాటు చర్యలు చేపట్టిన అధికారులు
రైల్వే ట్రాఫిక్ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రవేశపెట్టిన ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ బీహార్‌లోని సమస్తిపూర్–బరౌనీ రైల్వే సెక్షన్‌లో ప్రయాణికులకు శాపంగా మారింది. గురువారం సమస్తిపూర్ నుంచి కటిహార్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు (63308) కేవలం 9 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి దాదాపు రెండున్నర గంటల సమయం తీసుకుంది. మధ్యాహ్నం 12:55 గంటలకు సమస్తిపూర్‌లో బయలుదేరిన ఈ రైలు, షెడ్యూల్ ప్రకారం 1:05 గంటలకు ఉజియార్‌పూర్ చేరుకోవాల్సి ఉండగా, పదే పదే సిగ్నల్స్ వద్ద ఆగుతూ మధ్యాహ్నం 3:38 గంటలకు చేరుకుంది.

ఆటోమేటిక్ సిగ్నల్స్ వద్ద రైలు పదే పదే ఆగడంతో విసిగిపోయిన ప్రయాణికులు ఔటర్ సిగ్నల్ వద్ద దిగి నిరసన వ్యక్తం చేశారు. రైలు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. కటిహార్ ప్యాసింజర్‌తో పాటు న్యూఢిల్లీ–బరౌనీ స్పెషల్, గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌, మూడు గూడ్స్ రైళ్లు కూడా అదే సెక్షన్‌లో గంటల తరబడి నిలిచిపోయాయి. రైళ్లు నిలిచిపోయిన సమయంలో రైల్వే అధికారుల నుంచి సరైన సమాచారం అందడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

రైల్వే కంట్రోల్ రూమ్ నుంచి సరైన సమన్వయం లేకపోవడం, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటం వల్లే ఈ సమస్య తలెత్తుతోందని రైలు సిబ్బంది చెబుతున్నారు. ఈ సమస్యపై సమస్తిపూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ జ్యోతి ప్రకాష్ మిశ్రా స్పందిస్తూ.. ఈ ప్రాంతం సోన్పూర్ రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుందని, లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అప్ లైన్‌లో సమస్యలు పరిష్కారమయ్యాయని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Indian Railways
Samastipur
Barauni
Katihar Passenger
Automatic Signaling
Train Delay
Railway Traffic
Bihar
Train Passengers
Ujiarpur

More Telugu News