Sajjanar: 'నూతన సంవత్సర వేడుకలంటే సంబరాలే కాదు': పావలా శ్యామలను పరామర్శించిన సజ్జనార్

Sajjanar Visits Old Age Home and Pavala Syamala on New Year
  • కొత్త సంవత్సరం మొదటి రోజున వృద్ధాశ్రమాన్ని సందర్శించిన సజ్జనార్
  • కార్ఖానలోని ఆర్కే ఫౌండేషన్‌కు వెళ్లి హైదరాబాద్ సీపీ
  • వృద్ధాశ్రమాలు లేని సమాజం కావాలని ఆకాంక్షించిన సజ్జనార్
నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఒక వృద్ధాశ్రమాన్ని సందర్శించి అక్కడున్న 48 మంది వృద్ధుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి పావలా శ్యామలను కూడా ఆయన పరామర్శించారు. కొత్త సంవత్సరం సందర్భంగా తాను కార్ఖానలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని సందర్శించినట్లు 'ఎక్స్' వేదికగా సజ్జనార్ తెలిపారు.

"నూతన సంవత్సర వేడుకలంటే కేవలం సంబరాలు, హంగులే కాదు. ఆత్మీయతను పంచుకోవడం, బాధ్యతను గుర్తుచేసుకోవడం. ఇదే సంకల్పంతో ఈ ఏడాది తొలి రోజును నిరాడంబరంగా, సేవా దృక్పథంతో ప్రారంభించాను. సహచర పోలీసు అధికారులతో కలిసి కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని సందర్శించి, అక్కడి 48 మంది పెద్దల యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం ఆనందాన్ని కలిగించింది" అని ఆయన పేర్కొన్నారు.

అక్కడే అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి పావలా శ్యామలను పరామర్శించినట్లు తెలిపారు. పావలా శ్యామల కష్టకాలంలో స్పందించి ఆమెను హెల్త్ కేర్ సెంటర్‌లో చేర్పించారంటూ తిరుమలగిరి ఏసీపీ రమేశ్‌ను అభినందించారు. ఆర్కే ఫౌండేషన్ గురించి మాట్లాడుతూ, డాక్టర్ రామకృష్ణ 18 ఏళ్లుగా వేలాదిమందికి ఉచిత వైద్యం, ఆశ్రయం కల్పిస్తున్నారని, ఆయన సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

చివరగా ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. "వృద్ధాశ్రమాలు లేని సమాజం రావాలి. మనల్ని కంటికి రెప్పలా పెంచిన తల్లిదండ్రుల రుణం ఎంత సేవ చేసినా తీరనిది. ఆధునిక జీవనశైలి, ఒత్తిళ్ల సాకుతో వారిని వృద్ధాశ్రమాలకు పరిమితం చేయవద్దు. చరమాంకంలో వారికి కావాల్సింది ఆస్తులు కాదు. పిల్లల ఆప్యాయత, నాలుగు తీపి మాటలు మాత్రమే. తల్లిదండ్రులను భారంగా కాకుండా బాధ్యతగా, దైవంగా భావిద్దాం. వారి సేవలోనే నిజమైన ఆనందం, మోక్షం వెతుక్కుందాం" అని పేర్కొన్నారు.
Sajjanar
Hyderabad CP
Pavala Syamala
RK Foundation
old age home
charity
Hyderabad police

More Telugu News