Vande Bharat Sleeper: అత్యాధునిక హంగులతో వందే భారత్ స్లీపర్.. తొలి రైలు ప‌రుగులు పెట్టేది ఈ రూట్‌లోనే..!

Vande Bharat Sleeper Train First Route Announced Guwahati to Kolkata
  • గువాహటి-కోల్‌కతా మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలు
  • త్వరలోనే జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ
  • మొత్తం 16 కోచ్‌లు.. 823 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు
  • 3 ఏసీ టికెట్ ధర సుమారు రూ. 2,300గా నిర్ణయం
దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు పరుగులకు సిద్ధమైంది. ఈ రైలుకు సంబంధించిన తొలి రూట్‌ను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు అధికారికంగా ప్రకటించారు. అస్సాంలోని గువాహటి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలు నడవనుందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఈ రైలు టెస్టింగ్, సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తయిందని, త్వ‌ర‌లోనే ప్రధాని నరేంద్ర మోదీ ఈ సర్వీసును జెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు.

ఇటీవల కోటా-నాగ్డా సెక్షన్‌లో నిర్వహించిన ఫైనల్ ట్రయల్ రన్‌లో ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉండగా.. ఇందులో 11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ కోచ్ ఉన్నాయి. ఒకేసారి మొత్తం 823 మంది ప్రయాణించేలా దీనిని రూపొందించారు. వ్యాపారవేత్తలు, కుటుంబాలు, విద్యార్థులతో పాటు పర్యాటకులకు ఈ రాత్రిపూట ప్రయాణం (ఓవర్‌నైట్ జర్నీ) ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

టికెట్ ధరల విషయానికొస్తే.. ఆహారంతో కలిపి థర్డ్ ఏసీకి సుమారు రూ. 2,300, సెకండ్ ఏసీకి రూ. 3,000, ఫస్ట్ ఏసీకి రూ. 3,600గా ఉండనున్నట్లు సమాచారం. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు పెద్దపీట వేస్తూ ఈ రైలును తీర్చిదిద్దారు. ఎర్గోనామిక్ బెర్తులు, ఆటోమేటిక్ డోర్లు, అత్యాధునిక లైటింగ్, శబ్దం రాకుండా ప్రత్యేక చర్యలు, కవచ్ యాంటీ కొలిజన్ సిస్టమ్ వంటి ఆధునిక హంగులు ఇందులో ఉన్నాయి. వరల్డ్ క్లాస్ సౌకర్యాలతో కూడిన ఈ వందే భారత్ స్లీపర్.. రాత్రి ప్రయాణాల్లో ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుందని రైల్వే శాఖ తెలిపింది.
Vande Bharat Sleeper
Ashwini Vaishnaw
Guwahati to Kolkata
Indian Railways
Sleeper Train
Vande Bharat Express
Narendra Modi
AC Coaches
Train Travel

More Telugu News