DGCA: ఎయిర్ ఇండియా పైలట్లకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు

Aviation regulator issues notice to Air India crew over safety issues
  • భద్రతా లోపాలున్నా విమానాలు నడిపిన పైలట్లు
  • రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం
  • వరుస సాంకేతిక లోపాలతో ఎయిర్ ఇండియా సతమతం
భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై ఎయిర్ ఇండియా కాక్‌పిట్ సిబ్బందికి విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ-టోక్యో మధ్య నడిచిన విమానాల్లో భద్రతా లోపాలు, నిబంధనల అతిక్రమణ ఉన్నా.. వాటిని పట్టించుకోకుండా విమానాలను నడిపినందుకు ఈ నోటీసులు పంపింది. దీనిపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ముఖ్యంగా ఢిల్లీ నుంచి టోక్యో వెళ్లిన AI-357, తిరుగు ప్రయాణంలో టోక్యో నుంచి ఢిల్లీ వచ్చిన AI-358 విమానాల నిర్వహణలో లోపాలు జరిగినట్లు డీజీసీఏ గుర్తించింది. ఈ విమానాలకు సంబంధించిన 'మినిమమ్ ఎక్విప్‌మెంట్ లిస్ట్ (MEL)' నిబంధనలకు అనుగుణంగా లేదని పేర్కొంది. ఇది కేవలం ఒక్కసారి జరిగిన పొరపాటు కాదని, గతంలోనూ వేరే సెక్టార్లలో ఇలాంటి ఉల్లంఘనలే జరిగాయని డీజీసీఏ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్, సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం.. బాధ్యులైన పైలట్లపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ప్రశ్నించింది.

మరోవైపు గత నెలలో ఢిల్లీ-ముంబై విమానం (AIC 887) ఇంజిన్ సమస్యతో వెనక్కి వచ్చిన ఘటనపైనా డీజీసీఏ విచారణ జరుపుతోంది. ఆ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే రెండో ఇంజిన్‌లో ఆయిల్ ప్రెజర్ జీరోకి పడిపోవడంతో పైలట్లు వెంటనే ఆ ఇంజిన్‌ను షట్ డౌన్ చేసి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తుతున్నా వాటిని నడపడంపై డీజీసీఏ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనలన్నింటిపైనా డైరెక్టర్ ఎయిర్ సేఫ్టీ పర్యవేక్షణలో లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.
DGCA
Air India
Air India pilots
aviation safety
Delhi Tokyo flight
AIC 887
Boeing 787-8 Dreamliner
safety violations
minimum equipment list
aircraft rules

More Telugu News