Gold Price: కొత్త ఏడాదిలో స్వల్పంగా తగ్గిన పసిడి ధర

Gold Price Slight Decrease Silver Price Increase
  • కేజీ వెండి రూ. 2.36 లక్షల వద్ద ట్రేడింగ్
  • 2025లో ఇన్వెస్టర్లకు కాసుల వర్షం
  • ఏకంగా 75 శాతం పెరిగిన బంగారం ధర
  • ఏడాది కాలంలో 167 శాతం లాభాలతో  వెండి ఇన్వెస్టర్ల జైత్రయాత్ర
కొత్త సంవత్సరం 2026 ప్రారంభంలో దేశీయ కమోడిటీ మార్కెట్ (ఎంసీఎక్స్) మిశ్రమ ఫలితాలను నమోదు చేసింది. గత ఏడాది (2025) అసాధారణ లాభాలను ఆర్జించిన బంగారం, నేటి (జనవరి 1) ఉదయం ట్రేడింగ్‌లో లాభాల స్వీకరణ కారణంగా స్వల్పంగా తగ్గింది. మరోవైపు పారిశ్రామికంగా పెరిగిన డిమాండ్ కారణంగా వెండి ధరలు మాత్రం మరింత పుంజుకున్నాయి.

నేటి మార్కెట్ పరిస్థితి (ఉదయం 9:15 గంటలకు):  ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 0.07% తగ్గి 10 గ్రాములు రూ. 1,35,350 వద్ద కొనసాగుతోంది. అమెరికా డాలర్ బలోపేతం కావడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.మార్చి సిల్వర్ కాంట్రాక్టులు 0.17 శాతం పెరిగి కేజీ రూ. 2,36,108 వద్ద ట్రేడ్ అవుతోంది. గత ఏడాదిని (2025) విశ్లేషిస్తే.. బంగారం, వెండి ధరలు ఊహించని రీతిలో పెరిగాయి. ఇన్వెస్టర్లకు ఇది ఒక కలల సంవత్సరంగా మిగిలిపోయింది

బంగారం: డిసెంబర్ 31, 2024న రూ. 75,913 ఉన్న 10 గ్రాముల బంగారం, ఏడాది తిరిగేసరికి (డిసెంబర్ 31, 2025) రూ. 1,32,640 కి చేరింది. అంటే సుమారు 75 శాతం లాభాలను అందించింది.

వెండి: వెండి ధర ఇంకా వేగంగా దూసుకుపోయింది. 2024 చివరిలో రూ. 85,851 ఉన్న కేజీ వెండి, 2025 చివరి నాటికి ఏకంగా రూ. 2,29,452కు పెరిగింది. ఇది 167 శాతం భారీ వృద్ధి.

ధరల పెరుగుదలకు కారణాలు ఇవే..
వడ్డీ రేట్ల తగ్గింపు: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం, రాబోయే రోజుల్లో మరిన్ని కోతలు ఉండవచ్చనే అంచనాలు పసిడికి ప్రాణం పోశాయి.
అస్థిర పరిస్థితులు: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లేలా చేశాయి.
పరిశ్రమల డిమాండ్: ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ), సోలార్ ప్యానెల్స్, సెమీకండక్టర్లు, డేటా సెంటర్ల రంగాల్లో వెండి వినియోగం పెరగడం దాని ధర భారీగా పెరగడానికి కారణమైంది. డాలర్ పెరుగుదల వల్ల బంగారం ధరలో నేడు స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాల వల్ల ఈ ఏడాది కూడా పసిడి మెరుపులు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Gold Price
MCX
Commodity Market
Silver Price
Investment
Market Analysis
Interest Rates
US Federal Reserve
Economic Trends
Precious Metals

More Telugu News