Sharif Ahmed: ఓటర్ల జాబితా సవరణ పుణ్యమా అని 29 ఏళ్ల తర్వాత ‘మృతుడు’ ప్రత్యక్షం!

Sharif Ahmeds Unexpected Return After 29 Years in West Bengal
  • 1997 నుంచి జాడలేని వ్యక్తి
  • చనిపోయాడని భావించిన కుటుంబ సభ్యులు
  • బెంగాల్‌లో ఓటరు కార్డు కోసం పాత పత్రాల వేటలో సొంత ఊరికి రాక
  • ముజఫర్‌నగర్‌లో భావోద్వేగాల మధ్య కుటుంబ సభ్యుల పునఃకలయిక
అతడు చనిపోయాడని అందరూ భావించారు.. దాదాపు మూడు దశాబ్దాల పాటు అతడి ఊసు కూడా ఎవరికీ లేదు. కానీ, కాలం అనుకోని మలుపు తిరిగింది. పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ‘ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ’ (ఎస్ఐఆర్) పుణ్యమా అని, మరణించాడనుకున్న వ్యక్తి 29 ఏళ్ల తర్వాత ప్రాణాలతో తన సొంత గడ్డపై అడుగుపెట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా ఖతౌలీలో జరిగిన ఈ ఆశ్చర్యకర ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

షరీఫ్ అహ్మద్ (79) అనే వ్యక్తి 1997లో తన మొదటి భార్య మరణానంతరం రెండో వివాహం చేసుకుని పశ్చిమ బెంగాల్‌కు వలస వెళ్లాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో అతడికి సంబంధాలు తెగిపోయాయి. కుటుంబ సభ్యులు బెంగాల్ వెళ్లి వెతికినా ఫలితం లేకపోవడంతో, అతడు చనిపోయాడని భావించి అంతా మరచిపోయారు. షరీఫ్ అహ్మద్ నలుగురు కుమార్తెలు కూడా తమ తండ్రి లేడనే చేదు నిజాన్ని అంగీకరించి జీవిస్తున్నారు.

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ అతడిని ఇంటికి చేర్చింది. తన గుర్తింపు నిరూపించుకోవడానికి కావాల్సిన పాత పత్రాల కోసం షరీఫ్ అహ్మద్ తప్పనిసరి పరిస్థితుల్లో తన స్వస్థలమైన ఖతౌలీకి రావాల్సి వచ్చింది. డిసెంబర్ 29న అతడు అకస్మాత్తుగా ఇంటి ముందు ప్రత్యక్షం కావడంతో బంధువులంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు.

షరీఫ్ అహ్మద్ తిరిగి వచ్చేసరికి తన తండ్రి, సోదరుడు మరణించారని తెలుసుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. చనిపోయాడనుకున్న వ్యక్తి మళ్లీ తిరిగి రావడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. "ఇన్నేళ్ల తర్వాత ఆయనను చూడటం ఒక అద్భుతంలా ఉంది" అని షరీఫ్ మేనల్లుడు వసీం అహ్మద్ ఆనందం వ్యక్తంచేశాడు. ప్రస్తుతం షరీఫ్ తన పత్రాలను సేకరించుకుని, బెంగాల్‌లోని మెదినీపూర్ జిల్లాకు తిరిగి వెళ్లాడు.
Sharif Ahmed
voter list update
West Bengal
Uttar Pradesh
Muzaffarnagar
missing person
family reunion
election commission
identity documents

More Telugu News