NTR Bharosa Pensions: ఏపీలో ముందస్తు పింఛన్ల పండగ.. శ్రీకాకుళంలో 9 మంది లబ్ధిదారులకు రూ.18 లక్షల బకాయిలు అందజేత

Chandrababu AP Government Releases Funds for NTR Bharosa Pensions
  • నూతన సంవత్సరం సందర్భంగా ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ
  • రాష్ట్రవ్యాప్తంగా 63.12 లక్షల మందికి రూ.2,743 కోట్లు విడుదల
  • శ్రీకాకుళం జిల్లాలో 9 మందికి రూ.18 లక్షల బకాయిలు అందజేసిన మంత్రి అచ్చెన్న
  • పింఛనుదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
ఏపీలో నూతన సంవత్సర కానుకగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఇవాళ‌ పండుగ వాతావరణంలో జరిగింది. సాధారణంగా ప్రతినెలా ఒకటో తేదీన జరిగే ఈ కార్యక్రమం.. రేపు (జనవరి 1వ తేదీ) సెలవు దినం కావడంతో ఒక రోజు ముందుగానే నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే వాలంటీర్లు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి నగదు పంపిణీ చేయగా, మధ్యాహ్నం 12 గంటల సమయానికి రికార్డు స్థాయిలో 87 శాతం పంపిణీ పూర్తయింది. ఈ నెలలో మొత్తం 63.12 లక్షల మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం రూ.2,743 కోట్లు విడుదల చేసింది.

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా నందిగం మండలం దీనబంధుపురంలో గతంలో పింఛన్లు నిలిచిపోయిన 9 మందికి కోర్టు ఆదేశాల మేరకు బకాయిలతో సహా పింఛన్లను పునరుద్ధరించారు. నిలిపివేసిన రోజు నుంచి ఇప్పటివరకూ లెక్కించిన మొత్తం రూ.18 లక్షలను మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా ఆ 9 మంది లబ్ధిదారులకు అందజేయడం విశేషం.

పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న చంద్రబాబు
మరోవైపు ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు పింఛన్ల కోసమే దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.50 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని ఎక్స్ వేదికగా వెల్లడించారు. పేదల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ కార్యక్రమం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని, కొత్త ఏడాదిలో అందరికీ మంచి జరగాలని సీఎం ఆకాంక్షించారు.
NTR Bharosa Pensions
Chandrababu
Andhra Pradesh pensions
NTR Bharosa pension scheme
AP pension distribution
Kinjarapu Atchannaidu
Srikakulam
AP government schemes
Pension arrears payment
AP news
YSR pension scheme

More Telugu News