Swiggy-Zomato: సమ్మె పిలుపుతో దిగొచ్చిన ఫుడ్ డెలివరీ సంస్థలు.. డెలివరీ బాయ్స్‌కు భారీగా ఇన్సెంటివ్స్ పెంపు

Swiggy Zomato Offer Huge Incentives After Delivery Boy Strike Call
  • సమ్మె పిలుపు నేపథ్యంలో డెలివరీ వర్కర్లకు భారీ ఇన్సెంటివ్స్
  • ఇవాళ‌ పీక్ అవర్స్‌లో ఆర్డర్‌కు రూ.150 వరకు ఆఫర్ చేసిన జొమాటో
  • రెండు రోజుల్లో రూ.10 వేల వరకు సంపాదించుకునే ఛాన్స్ ఇచ్చిన స్విగ్గీ
  • వేతనాలు, పని పరిస్థితులపై నిరసనగా సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్లు
నూతన సంవత్సర వేడుకల వేళ ఫుడ్ డెలివరీ దిగ్గజ సంస్థలు స్విగ్గీ, జొమాటో తమ డెలివరీ పార్ట్‌నర్లకు (గిగ్ వర్కర్లు) శుభవార్త చెప్పాయి. వేతనాలు పెంచాలని, పని పరిస్థితులు మెరుగుపరచాలని కోరుతూ డెలివరీ వర్కర్ల యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సేవలకు అంతరాయం కలగకుండా కంపెనీలు భారీ ఇన్సెంటివ్స్ (ప్రోత్సాహకాలు) ప్రకటించాయి.

ఒక్క రోజులో రూ.3 వేల వరకు.. డెలివరీ పార్ట్‌నర్లకు జొమాటో బంపర్ ఆఫర్
ఈరోజు (డిసెంబర్ 31న) ఆర్డర్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని జొమాటో సంస్థ తన డెలివరీ పార్ట్‌నర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య ఉండే పీక్ అవర్స్‌లో ఒక్కో ఆర్డర్‌కు రూ.120 నుంచి రూ.150 వరకు చెల్లించనున్నట్లు తెలిపింది. ఆర్డర్ల లభ్యతను బట్టి ఒక్క రోజులోనే డెలివరీ బాయ్స్ రూ.3,000 వరకు సంపాదించుకునే అవకాశం కల్పించింది. అంతేకాకుండా ఆర్డర్లను రద్దు చేసినా లేదా తిరస్కరించినా విధించే పెనాల్టీలను తాత్కాలికంగా ఎత్తివేసింది.

భారీ ప్యాకేజీ ప్రకటించిన స్విగ్గీ
మరోవైపు స్విగ్గీ కూడా డెలివరీ వర్కర్లకు భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఈరోజు, రేపు.. ఈ రెండు రోజుల్లో కలిపి డెలివరీ పార్ట్‌నర్లు రూ.10,000 వరకు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ముఖ్యంగా డిసెంబర్ 31 రాత్రి పీక్ అవర్స్‌లో రూ.2,000 వరకు అదనపు పేమెంట్ ఆఫర్ చేస్తోంది. క్విక్ కామర్స్ సంస్థ జెప్టో కూడా తమ డెలివరీ సిబ్బందికి ఇన్సెంటివ్స్ పెంచింది.

ఈనెల‌ 25న క్రిస్మస్ రోజున యూనియన్లు సమ్మె చేపట్టడంతో కొన్ని ప్రాంతాల్లో సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఇవాళ‌ సమ్మెను మరింత ఉద్ధృతం చేయాలని యూనియన్లు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే కంపెనీలు డెలివరీ బాయ్స్‌ను ఆకట్టుకునేందుకు ఈ ఆఫర్లు ప్రకటించాయి.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సోషల్ సెక్యూరిటీ కోడ్-2020 ప్రకారం గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అగ్రిగేటర్లు తమ వార్షిక టర్నోవర్‌లో 1-2 శాతం మేర సోషల్ సెక్యూరిటీ ఫండ్‌కు జమ చేయాల్సి ఉంటుంది. ఇటీవల స్టాక్ మార్కెట్లో స్విగ్గీ, జొమాటో మాతృసంస్థ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.
Swiggy-Zomato
Swiggy
Swiggy delivery incentives
Zomato
Zomato delivery incentives
food delivery
delivery partners
gig workers
New Year offers
delivery boy strike
social security code 2020

More Telugu News