Visakhapatnam: విశాఖలో న్యూ ఇయర్ ఆంక్షలు విధించిన పోలీసులు.. సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

Vizag Police Impose New Year Restrictions CP Shankha Brat Bagchi Strong Warning
  • అనుమతి లేకుండా ఈవెంట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయ‌న్న సీపీ బాగ్చీ
  • నగరంలో భారీగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
  • అగ్నిమాపక, పొల్యూషన్ అనుమతులు ఉంటేనే ఈవెంట్లకు ఛాన్స్
నూతన సంవత్సర వేడుకల వేళ విశాఖపట్నంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగర పోలీస్ కమిషనర్ శంక బ్రత బాగ్చీ కఠిన ఆంక్షలు విధించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా క్షేత్రస్థాయి పోలీసు అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.

పోలీసుల అనుమతి లేకుండా నగరంలో ఎలాంటి న్యూ ఇయర్ ఈవెంట్లు, పార్టీలు నిర్వహించరాదని సీపీ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేని కార్యక్రమాలు చేపడితే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి ఈవెంట్లు జరపాలని నిర్ణయించుకున్నా ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని, అలాగే నిర్ణయించిన పరిమితికి మించి జనాలను పోగు చేయవద్దని సూచించారు.

మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న వేడుకల దృష్ట్యా నగరంలో పెద్ద ఎత్తున డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని సీపీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న 'బ్లాక్ స్పాట్‌'లను ఇప్పటికే గుర్తించి అక్కడ ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేవలం పోలీసు అనుమతే కాకుండా.. ఈవెంట్లు నిర్వహించే వారు కాలుష్య నియంత్రణ మండలి, మున్సిపల్, అగ్నిమాపక శాఖల అధికారుల నుంచి కూడా తప్పనిసరిగా అనుమతులు పొందాలని సీపీ వివరించారు.
Visakhapatnam
Shankha Brat Bagchi
Vizag
New Year Celebrations
Police Restrictions
Drunken Drive
New Year Events
Andhra Pradesh Police

More Telugu News