Sammakka Saralamma Jatara: కిటకిటలాడుతున్న వనం.. ముందస్తు మొక్కుల్లో మేడారం భక్తులు!

Sammakka Saralamma Jatara Devotees Flock to Medaram Early
  • వచ్చే నెల 28 నుంచి మహాజాతర ప్రారంభం
  • ఇప్పటి నుంచే పోటెత్తుతున్న భక్తులు
  • ఎత్తుబెల్లం, యాటలతో మొక్కులు తీర్చుకుంటున్న భక్తజనం
  • రూ.251 కోట్లతో మేడారంలో అభివృద్ధి పనులు
ములుగు జిల్లాలోని మేడారం అప్పుడే ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వచ్చే నెల (జనవరి) 28 నుంచి నాలుగు రోజుల పాటు జరిగే సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ముందే భక్తులు మేడారానికి క్యూ కడుతున్నారు. జాతర సమయంలో ఉండే విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నవారు, వృద్ధులు ఇప్పుడే వచ్చి వనదేవతలను దర్శించుకుంటున్నారు.

మేడారానికి తరలివస్తున్న భక్తులు తమ బరువుకు తూగేలా 'బంగారం' (బెల్లం) తూచి గద్దెల వద్ద సమర్పిస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లులకు ఎదుర్కోళ్లు, యాట మొక్కులతో తమ భక్తిని చాటుకుంటున్నారు. మేడారంతో పాటు చుట్టుపక్కల 40 కిలోమీటర్ల మేర ఉండే ప్రతి చెట్టు, పుట్టను అమ్మవార్ల ప్రతిరూపంగా భావించడం ఇక్కడి విశేషం. జాతర సమయంలో అడవిలోని వన్యప్రాణులు భక్తులకు ఎలాంటి హాని చేయవనేది తరతరాలుగా వస్తున్న నమ్మకం.

ఈసారి జాతరను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.251 కోట్లతో భారీ అభివృద్ధి పనులు చేపట్టింది. గద్దెల ఆధునికీకరణ, విశాలమైన క్యూలైన్లు, రాతి కట్టడాలు, రహదారుల విస్తరణతో మేడారం సరికొత్తగా కనిపిస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తలస్నానాల కోసం జంపన్న వాగు వద్ద కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

జాతర సమయంలో మేడారం చుట్టుపక్కల ఉన్న ఊరట్టం, కన్నెపల్లి, నార్లాపూర్ వంటి గ్రామాలన్నీ కలిసి ఒక పెద్ద పట్టణంగా మారిపోతున్నాయి. ఇప్పటికే అక్కడ హోటళ్లు, బిర్యానీ సెంటర్లు వెలిశాయి. ఎడ్లబండ్ల నుంచి హెలికాప్టర్ సేవల వరకు, సామాన్యుల వినోదం నుంచి విలాసవంతమైన వస్తువుల వరకు అన్నీ మేడారంలో అందుబాటులోకి వస్తున్నాయి.
Sammakka Saralamma Jatara
Medaram Jatara
Sammakka
Saralamma
Telangana Festivals
Tribal Festival
Medaram Temple
Jampanna Vagu
Mulugu District

More Telugu News