Masoud Pezeshkian: మునిగిపోతున్న ఇరాన్ రియాల్: ఆకాశాన్నంటిన ధరలు.. ప్రజల నిరసనలు!

Iranian Rial Crisis Protests Rock Tehran After Currency Crash
  • డాలర్‌తో పోలిస్తే 14 లక్షలకు పడిపోయిన రియల్ విలువ.. బజార్లు బంద్
  • ధరల పెరుగుదలపై రాజధాని టెహ్రాన్ సహా ప్రధాన నగరాల్లో భారీ ప్రదర్శనలు 
  • జూన్‌లో ఇజ్రాయెల్-అమెరికా దాడులతో దెబ్బతిన్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థ
  • కరెన్సీ పతనానికి బాధ్యత వహిస్తూ ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రాజీనామా
  • నిరసనకారులతో చర్చలకు సిద్ధమన్న అధ్యక్షుడు 
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొట్టుమిట్టాడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, కరెన్సీ 'రియాల్' విలువ గతంలో ఎన్నడూ లేనంతగా (డాలర్‌కు 1.42 మిలియన్లు) పడిపోవడంతో వ్యాపారులు, సామాన్య ప్రజలు తిరుగుబాట పట్టారు. టెహ్రాన్‌లోని ప్రధాన వాణిజ్య కేంద్రాలు, మొబైల్ మార్కెట్లు, చారిత్రక 'గ్రాండ్ బజార్' మూతపడ్డాయి. జంహూరీ ఏరియాలో వేలాది మంది వ్యాపారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో టెహ్రాన్ వీధులు రణరంగాన్ని తలపించాయి.

ఇరాన్ దుస్థితికి కేవలం కరెన్సీ పతనం మాత్రమే కారణం కాదు. 2025 జూన్‌లో ఇజ్రాయెల్, అమెరికా జరిపిన 12 రోజుల వైమానిక దాడులు దేశాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ దాడుల్లో వెయ్యి మందికి పైగా మరణించడమే కాకుండా, కీలక అణు కేంద్రాలు, సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. దీనికి తోడు అమెరికా విధిస్తున్న కఠినమైన ఆర్థిక ఆంక్షలు, తీవ్రమైన నీటి ఎద్దడి, ఇంధన సంక్షోభం ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయి. ద్రవ్యోల్బణం 50 శాతానికి చేరువలో ఉండగా, ప్రభుత్వం పన్నులను 62 శాతం పెంచడం ప్రజల ఆగ్రహానికి ఆజ్యం పోసింది.

ప్రజల నిరసనలు మిన్నంటడంతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కరెన్సీ పతనానికి బాధ్యత వహిస్తూ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ మహమ్మద్ రెజా ఫర్జిన్ రాజీనామా చేయగా, ఆయన స్థానంలో కొత్త గవర్నర్‌ను నియమించారు. ప్రజల డిమాండ్లు న్యాయమైనవేనని అంగీకరించిన అధ్యక్షుడు.. నిరసనకారుల ప్రతినిధులతో చర్చలు జరపాలని అంతర్గత వ్యవహారాల మంత్రిని ఆదేశించారు. అయితే, ఒకవైపు పశ్చిమ దేశాల ఒత్తిడి, మరోవైపు దేశవ్యాప్త అసమ్మతి మధ్య ఇరాన్ ప్రభుత్వం ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడుతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
Masoud Pezeshkian
Iran economy
Iranian Rial
Tehran protests
Iran currency crisis
Israel air strikes
US sanctions Iran
Iran inflation
Mohammad Reza Farzin
Iran government

More Telugu News