ICMR National Institute of Nutrition: ప్రకటనల మాయలో యువత: దేశంలోని కౌమార దశ పిల్లల ఆహారపు అలవాట్లపై షాకింగ్ నిజాలు!

ICMR National Institute of Nutrition Shocking facts about teenage food habits in India
  • ఆహార ప్రకటనల ప్రభావంతోనే 67.6 శాతం మంది పిల్లలు జంక్ ఫుడ్ వైపు మొగ్గు
  • పోషకాహారం ఖరీదుగా ఉండటం, సులభంగా అందుబాటులో లేకపోవడం ప్రధాన అడ్డంకులు
  • ఫుడ్ ప్యాకెట్లపై ఉండే సమాచారం అర్థం కావడం లేదంటున్న 62.8 శాతం మంది
  • దేశవ్యాప్తంగా 1.44 లక్షల మంది విద్యార్థులపై 'నిన్', యూనిసెఫ్ సంయుక్త సర్వే
భారతదేశంలోని కౌమారదశ (10-19 ఏళ్లు) పిల్లలు ఏమి తింటున్నారో, వారి ఆహారపు అలవాట్లను ఏవి శాసిస్తున్నాయో తెలుపుతూ 'పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా', 'ఐసీఎంఆర్-నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్' (ఎన్ఐఎన్), 'యూనిసెఫ్' సంయుక్తంగా ఒక అధ్యయనాన్ని నిర్వహించాయి. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 1.44 లక్షల మందిపై జరిపిన ఈ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువత తీసుకునే ఆహారంపై టీవీలు, సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది.

సర్వేలో పాల్గొన్న వారిలో 67.6 శాతం మంది ప్రకటనలను చూసే తాము ఆహారాన్ని ఎంచుకుంటున్నామని అంగీకరించారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ, సుమారు 30.7 శాతం మంది అది చాలా ఖరీదుగా ఉందని, తమకు అందుబాటులో లేదని తెలిపారు. మరో 15.3 శాతం మంది పౌష్టికాహారం రుచిగా ఉండటం లేదని చెప్పడం గమనార్హం. కేవలం అవగాహన పెంచడమే కాకుండా, పోషకాహారం తక్కువ ధరకే దొరికేలా చూడాల్సిన అవసరం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.

ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై ఉండే న్యూట్రిషన్ వివరాలను 72.6 శాతం మంది చదవాలనుకుంటున్నప్పటికీ, అందులోని సాంకేతిక పదాలు అర్థం కావడం లేదని 62.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఈ లేబులింగ్ విధానాన్ని మరింత సరళతరం చేయాలని వారు కోరుతున్నారు. అలాగే, పిల్లలకు ఆహారంపై సరైన అవగాహన కల్పించడంలో పాఠశాలలు (49.5 శాతం) కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఆ తర్వాత ఆన్‌లైన్ మాధ్యమాలు నిలుస్తున్నాయని సర్వే వెల్లడించింది.

ప్రపంచంలోనే అత్యధికంగా కౌమార దశ జనాభా ఉన్న భారత్‌లో ఇప్పుడే సరైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో జీవనశైలి వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం హెచ్చరించింది. జంక్ ఫుడ్ ప్రకటనలపై నియంత్రణ, ఆహారపు ప్యాకెట్లపై స్పష్టమైన సమాచారం, పాఠశాలల్లో పౌష్టికాహార విద్యను బలోపేతం చేయడం ద్వారానే ఈ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ICMR National Institute of Nutrition
Teenage diet habits
Indian youth
Junk food advertisements
Nutrition education
Public Health Foundation of India
UNICEF
Adolescent health
Nutritional food
Food labeling

More Telugu News