Draksharamam: ద్రాక్షారామంలో కలకలం.. కపాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసం

Kapaleswara Swamy Shivalingam Destroyed in Draksharamam Temple
  • ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు 
  • నిందితులను కఠినంగా శిక్షించాలని చంద్రబాబు ఆదేశం 
  • ఎస్పీ నేతృత్వంలో రంగంలోకి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్
  • ఆరు ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు 
  • ధ్వంసమైన చోట శాస్త్రోక్తంగా కొత్త శివలింగం ప్రతిష్ఠాపన
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో అపచారం జరిగింది. సప్తగోదావరి తీరాన ఉత్తర గోపురం వద్ద ఉన్న కపాలేశ్వర స్వామి శివలింగాన్ని దుండగులు సోమవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికులు, భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. శివలింగంపై సుత్తి వంటి మొనదేలిన ఆయుధంతో కొట్టి విరగ్గొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

విషయం తెలిసిన వెంటనే కాకినాడ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఘటనా స్థలానికి చేరుకుని స్వయంగా పరిశీలించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు అక్కడి ఆధారాలను సేకరించారు. ఆలయ ఆవరణలో సీసీ కెమెరాలు లేకపోవడంతో, చుట్టుపక్కల ఉన్న కెమెరాల ఫుటేజీని పోలీసులు జల్లెడ పడుతున్నారు. నిందితుల కోసం ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు ఎస్పీ ప్రకటించారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశించారు. మంత్రి ఆనం స్పందిస్తూ.. ధ్వంసమైన చోట ఇప్పటికే వేద పండితుల సమక్షంలో కొత్త శివలింగాన్ని పునఃప్రతిష్ఠించామని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.

మరోవైపు, ఈ ఘటనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఖండించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, హిందూ ధర్మంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Draksharamam
Kapaleswara Swamy
Shivalingam
Andhra Pradesh temple
temple vandalism
Chandrababu Naidu
Anam Ramanarayana Reddy
PVN Madhav
Kona Seema district
Hindu Dharma

More Telugu News