Bajendra Biswas: బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య... అనుకోకుండా కాల్చాడా?

one more hindu killed in bangladesh
  • స్వెటర్స్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న బజేంద్ర హత్య
  • కాల్చి చంపిన తోటి ఉద్యోగి
  • అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన బజేంద్ర

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకటి తర్వాత ఒకటిగా హింసాత్మక ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో అక్కడి పరిస్థితులపై అంతర్జాతీయంగా కూడా చర్చ మొదలైంది. దీపు చంద్ర దాస్, అమృత్ మండల్ హత్యల తర్వాత తాజాగా మరో హిందూ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మైమన్‌సింగ్ జిల్లాలో పనిచేస్తున్న 42 ఏళ్ల బజేంద్ర బిశ్వాస్‌ను అదే ఫ్యాక్టరీలో పని చేసే యువకుడు కాల్చి చంపిన ఘటన కలకలం రేపుతోంది.


భాలుకా ఉపజిల్లాలోని లాబిబ్ గ్రూప్‌కు చెందిన సుల్తానా స్వెటర్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఈ దారుణం చోటుచేసుకుంది. బజేంద్ర బిశ్వాస్ అక్కడ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తుండగా, నిందితుడిగా గుర్తించిన 22 ఏళ్ల నోమన్ మియాన్ కూడా అదే యూనిట్‌లో భద్రతా విధుల్లో ఉన్నాడు. బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ‘అన్సార్’ విభాగంలో ఇద్దరూ పని చేస్తున్నారు. సంఘటన సమయంలో ఇద్దరూ మాట్లాడుకుంటుండగా, నోమన్ తన వద్ద ఉన్న ప్రభుత్వ తుపాకీని సరదాగా బజేంద్ర వైపు గురిపెట్టి అకస్మాత్తుగా కాల్చాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో బజేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.


సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అనుకోకుండా జరిగిందా? లేక వెనుక మరేదైనా ఉద్దేశం ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అయితే వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో ఈ హత్యను సాధారణ ఘటనగా తీసుకోలేమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఇదే జిల్లాలో ఇటీవల దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని ‘దైవదూషణ’ ఆరోపణలతో మతోన్మాద మూక అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అతడిని హత్య చేసి, నగ్నంగా శరీరాన్ని చెట్టుకు కట్టేసి తగలబెట్టిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ తర్వాత రాజ్‌బరి జిల్లాలో అమృత్ మండల్ అనే మరో హిందూ వ్యక్తిని గ్రామస్తులు మూకగా దాడి చేసి చంపిన ఘటన మరింత ఉద్రిక్తతకు దారి తీసింది.


ఈ వరుస హత్యలతో బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై పెద్ద ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్కడి ప్రభుత్వం పరిస్థితిని ఎలా అదుపులోకి తీసుకుంటుందో, ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్నదానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

Bajendra Biswas
Bangladesh Hindu murder
Hindu killings Bangladesh
Mymensingh district
Noman Miah
Sultana Sweaters Limited
Religious violence Bangladesh
Minority safety Bangladesh
Attacks on Hindus
Bangladesh news

More Telugu News