Vrindavan: దయచేసి బృందావనం రావొద్దు.. ఆలయం ప్రకటన

Vrindavan Temple Asks Devotees To Postpone Visits Until January 5
  • నూతన సంవత్సరం సందర్భంగా పెరిగిన రద్దీ
  • జనవరి 5 వరకూ ఆలయానికి రావొద్దన్న నిర్వాహకులు
  • రద్దీ తగ్గిన తర్వాత వచ్చి దర్శనం చేసుకోవాలని గోస్వామి విజ్ఞప్తి
ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ‘బృందావనం’ ఆలయం కీలక ప్రకటన జారీ చేసింది. జనవరి 5 వరకు ఆలయానికి రావొద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేసింది. కొత్త ఏడాది సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉందని, నియంత్రణ కష్టంగా మారిందని పేర్కొంది. ముఖ్యంగా బృందావనంలోని శ్రీ బాంకే బిహారీ ఆలయంలో రద్దీ విపరీతంగా ఉంది. దీంతో బాంకే బిహారీ ఆలయ పూజారి భక్తులకు విజ్ఞప్తి చేశారు. జనవరి 5 వరకు భక్తులు రావొద్దని, ఆ తర్వాత ఆలయాన్ని సందర్శించుకోవచ్చని తెలిపింది.

కిక్కిరిసిన బృందావనం వీధులు
ఏటా డిసెంబర్ చివరి వారంలో శ్రీకృష్ణుడి ఆశీస్సులు పొందేందుకు లక్షలాది మంది భక్తులు బృందావనం వస్తుంటారు. మథుర చుట్టుపక్కల ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. ఈ ఏడాది భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో బృందావనంలోని వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. నడవడానికి కూడా ఖాళీ లేని విధంగా రద్దీ పెరగడంతో ఆలయ ప్రాంగణంలో అవాంఛనీయ సంఘటనలు జరిగే ప్రమాదం ఉందని నిర్వాహక కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు ఈ రద్దీ సమయంలో ఆలయానికి రాకపోవడమే మంచిదని సూచించింది.

బృందావనంలోకి వాహనాల ఎంట్రీపై ఆంక్షలు..
భక్తుల రద్దీ నేపథ్యంలో మథుర జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయింది. బృందావనంలోకి బయటి వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధించింది. ప్రధాన రహదారుల నుంచి వచ్చే భారీ వాహనాలను దారి మళ్లించి, భక్తుల వాహనాలను నిర్ణీత పార్కింగ్ ప్రదేశాలకే అధికారులు పరిమితం చేశారు. ఆలయానికి వెళ్లే మార్గాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు.
Vrindavan
Banke Bihari Temple
Uttar Pradesh
Mathura
Temple Advisory
Tourist Crowd Control
Indian Pilgrimage
Religious Tourism
Krishna devotees
Public safety

More Telugu News