Yadagirigutta Temple: తిరుమల తరహాలో యాదగిరిగుట్ట ఆలయంలో ప్రత్యేక సేవలు

Yadagirigutta Temple to Introduce Special Sevas Like Tirumala
  • యాదగిరిగుట్ట క్షేత్రంలో భక్తుల కోసం పలు కొత్త సేవలు అందుబాటులోకి
  • ప్రతి బుధవారం తోమాల సేవ
  • సరికొత్తగా తులాభారం సేవ
  • నేటి నుంచి ప్రతిరోజూ సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ
  • ఫిబ్రవరి నుంచి వాహన సేవలు
తెలంగాణలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో ఆర్జిత సేవలను ప్రారంభించేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సేవలలో కొన్నిటిని వైకుంఠ ఏకాదశి నుంచి, మిగతా వాటిని ఫిబ్రవరి నెల నుంచి దశలవారీగా భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. 
 
కొత్తగా ప్రవేశపెట్టనున్న సేవల్లో భాగంగా ముందుగా తోమాల సేవను ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సేవ ప్రతి బుధవారం ఉదయం 6.15 నుంచి 6.45 గంటల వరకు నిర్వహించనున్నారు. దంపతులు కలిసి పాల్గొనే ఈ సేవకు టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. భక్తులు స్వామివారికి తోమాల సమర్పించి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందే అవకాశం ఉంటుంది.
 
ఇప్పటి వరకు ఉన్న విధానానికి భిన్నంగా తులాభారం సేవను సరికొత్తగా రూపొందించారు. ఈ సేవలో అవసరమైన నాణేలు, బెల్లం వంటి వస్తువులను ఆలయ అధికారులు స్వయంగా అందుబాటులో ఉంచనున్నారు. దీంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా తులాభారం నిర్వహించుకునే అవకాశం కలగనుంది.
 
వైకుంఠ ఏకాదశి తర్వాత ప్రతిరోజూ సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవను ప్రారంభించనున్నారు. ఈ సేవకు టికెట్ ధర రూ.500గా నిర్ణయించగా, ఇందులో పాల్గొన్న భక్తులకు రెండు లడ్డూ ప్రసాదాలను ఉచితంగా అందజేయనున్నారు. 
 
ఇక ఇప్పటివరకు రథసప్తమి రోజుకే పరిమితమైన సూర్యప్రభ వాహన సేవను ఇకపై ప్రతి ఆదివారం ఉదయం 7.00 నుంచి 7.30 గంటల వరకు నిర్వహించనున్నారు. దంపతుల కోసం ఈ సేవ టికెట్ ధరను రూ.1,000గా నిర్ణయించారు. ఈ సేవలో పాల్గొనే భక్తులకు ఒక శాలువా, కనుమను ప్రసాదంగా అందజేస్తారు.
 
అలాగే ఆలయ చరిత్రలో తొలిసారిగా చంద్రప్రభ వాహన సేవను కూడా ప్రారంభించనున్నారు. ఈ సేవకు కూడా టికెట్ ధర రూ.1,000గా నిర్ణయించగా, ప్రత్యేక వాహన సేవ ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు.
 
వైకుంఠ ఏకాదశి నుంచే తోమాల సేవ, తులాభారం సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు అందుబాటులోకి తీసుకువస్తుండగా, 2026 ఫిబ్రవరి 1వ తేదీ (మాఘ శుద్ధ పౌర్ణమి) నుంచి సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలను ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 
యాదగిరిగుట్టను ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అధికారులు తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
Yadagirigutta Temple
Lakshmi Narasimha Swamy
Telangana Temples
Tirumala TTD
Special Sevas
Thomala Seva
Thulabaram Seva
Sahasra Deepalankarana Seva
Surya Prabha Vahana Seva
Chandra Prabha Vahana Seva

More Telugu News