Donald Trump: పుతిన్ నివాసంపై డ్రోన్ల దాడి.. ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్!

Donald Trump reacts to Putin residence drone attack
  • పుతిన్ నివాసమే లక్ష్యంగా ఉక్రెయిన్ 91 డ్రోన్లతో దాడి!
  • పుతిన్ స్వయంగా తనకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారన్న ట్రంప్
  • రష్యా చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేసిన జెలెన్‌స్కీ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడికి పాల్పడిందన్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. సోమవారం ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో రిసార్ట్‌లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో సమావేశానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ డ్రోన్ల సమూహం తన నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పుతిన్ స్వయంగా తనకు ఫోన్ చేసి చెప్పారని ట్రంప్ వెల్లడించారు.

"ఈ విషయం నాకు ఎవరు చెప్పారో తెలుసా? ఈ రోజు ఉదయాన్నే అధ్యక్షుడు పుతిన్ స్వయంగా చెప్పారు. తనపై దాడి జరిగిందని ఆయన అన్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు.. నాకు చాలా కోపంగా ఉంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ దాడి వార్త అబద్ధం అయ్యే అవకాశం కూడా ఉందని ఆయన అంగీకరించారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం వేరని, కానీ ఏకంగా నివాసంపై దాడి చేయడం సరికాదని, ఇలాంటి పనులు చేయడానికి ఇది సరైన సమయం కాదని ట్రంప్ పేర్కొన్నారు.

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ కథనం ప్రకారం.. డిసెంబర్ 28, 29 తేదీల్లో మాస్కోకు పశ్చిమాన ఉన్న నొవ్‌గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ 91 లాంగ్ రేంజ్ డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. అయితే రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు వాటన్నింటినీ కూల్చివేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు. ఇవన్నీ రష్యా చెబుతున్న అబద్ధాలేనని ఆయన కొట్టిపడేశారు.

ఒకవైపు ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, పుతిన్‌తో తన సంభాషణ ఫలప్రదంగా సాగిందని ట్రంప్ చెప్పారు. 24 గంటల వ్యవధిలోనే పుతిన్‌తో ఆయన రెండుసార్లు మాట్లాడారు. కొన్ని క్లిష్టమైన సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తే శాంతి నెలకొంటుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం జెలెన్‌స్కీతోనూ సమావేశమైన ట్రంప్ యుద్ధాన్ని ముగించే ఒప్పందానికి తాము చాలా దగ్గరగా ఉన్నామని పేర్కొనడం గమనార్హం. కాగా, ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా ప్రాంతంపై పూర్తి నియంత్రణ సాధించాలని పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించడం గమనార్హం.
Donald Trump
Putin drone attack
Russia Ukraine war
Volodymyr Zelensky
Netanyahu
Mar-a-Lago
Sergei Lavrov
Russia
Ukraine
drone attack

More Telugu News