Cyberabad Police: న్యూ ఇయర్ వేడుకలు: క్యాబ్ డ్రైవర్లు రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా!

Cyberabad Police Warns Cab Drivers Against Ride Cancellations on New Years Eve
  • మార్గదర్శకాలు జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు
  • క్యాబ్, ఆటో డ్రైవర్లు రైడ్లను నిరాకరిస్తే ఈ-చలాన్ ద్వారా పెనాల్టీ
  • డ్రైవర్ల వేధింపులు, అధిక ఛార్జీలపై 9490617346కు వాట్సాప్ చేయొచ్చన్న పోలీసులు
  • రేపు రాత్రి 8 గంటల నుంచే నగరంవ్యాప్తంగా స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్
కొత్త సంవత్సర వేడుకల వేళ నగరవాసుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సైబరాబాద్ పోలీసు యంత్రాంగం కఠిన చర్యలకు ఉపక్రమించింది. వేడుకల ముసుగులో నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని సోమవారం జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ముఖ్యంగా క్యాబ్, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లకు పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

ప్రయాణికులు యాప్‌ ద్వారా రైడ్ బుక్ చేసుకున్నప్పుడు డ్రైవర్లు వాటిని నిరాకరించకూడదని, అలా చేస్తే ఈ-చలాన్ల రూపంలో భారీ జరిమానాలు విధిస్తామని పోలీసులు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని, వాహన పత్రాలన్నీ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించినా లేదా అదనపు ఛార్జీలు డిమాండ్ చేసినా కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. డ్రైవర్లు నిబంధనలు అతిక్రమిస్తే.. వాహనం నంబర్, సమయం, ప్రాంతం వివరాలతో 94906 17346 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.

మద్యం తాగిన వారు వాహనాలు నడపకుండా చూడాల్సిన బాధ్యత బార్, పబ్, క్లబ్ నిర్వాహకులదేనని పోలీసులు స్పష్టం చేశారు. కస్టమర్లు తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే, సంబంధిత యాజమాన్యాలపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

డిసెంబర్ 31న రాత్రి 8 గంటల నుంచే సైబరాబాద్ పరిధిలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, అతివేగం, సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ లేని ప్రయాణం వంటి ఉల్లంఘనలను గుర్తించేందుకు రహదారులపై ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Cyberabad Police
New Year
New Year Celebrations
Cab Drivers
Drink and Drive
Traffic Rules
Hyderabad
Telangana
E-Challan
Traffic Violations

More Telugu News