Rafiq: ఆసుపత్రుల్లో ఉండాల్సిన డాక్టర్ మావోయిస్టు పార్టీలో... సంచలన విషయాలు వెలుగులోకి!

Rafiq Luxury Hospital Doctor Becomes Maoist Party Lifeline
  • మావోలకు ప్రాణదాతగా మారిన డాక్టర్ రఫీక్ అలియాస్ మణ్‌దీప్ 
  • అడవుల్లోనే... గాయాల నుంచి బుల్లెట్లు తీయడం వంటి చికిత్సలు
  • ప్రస్తుతం ఝార్ఖండ్‌లో ఉన్నట్టు భద్రతా బలగాల అనుమానం

మావోయిస్టు పార్టీ నానాటికీ బలహీనం అవుతోంది. భారీ ఎన్ కౌంటర్లు, లొంగుబాట్లు మావోయిస్టు పార్టీని పూర్తిగా బలహీనపరుస్తున్నాయి. అడవుల్లో పరిస్థితులు రోజు రోజుకీ ప్రతికూలంగా మారడం, భద్రతా బలగాల కూంబింగ్ లు, దాడులు పెరగడం, సరైన సదుపాయాలు లేకపోవడం వంటి కారణాలతో పార్టీ అగ్రనేతలు సైతం సరెండర్ బాట పడుతున్నారు. ఇలాంటి సమయంలో మావోయిస్టు పార్టీలో ఏళ్ల తరబడి రహస్యంగా పనిచేసిన ఓ డాక్టర్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.


అడవుల్లో, కనీస సదుపాయాలు లేని దండకారణ్యంలో మావోయిస్టులకు ఆ డాక్టర్ ప్రాణదాతగా మారాడు. ఆయనే డాక్టర్ రఫీక్ అలియాస్ మణ్‌దీప్. పంజాబ్‌కు చెందిన రఫీక్ ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడు. ఆ భావజాలంతోనే చదువుకున్న వైద్య వృత్తిని వదిలి అడవిబాట పట్టాడు.


కొన్నేళ్ల పాటు మావోయిస్టు పార్టీలో కొనసాగిన రఫీక్... ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం, దండకారణ్య అడవుల్లో పూర్తిస్థాయి వైద్య వ్యవస్థను ఏర్పాటు చేశాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఎన్‌కౌంటర్లలో గాయపడిన మావోయిస్టులకు చికిత్స చేయడం, తూటాల గాయాలకు కుట్లు వేయడం, బుల్లెట్లను బయటకు తీయడం వంటి క్లిష్టమైన చికిత్సలు కూడా అడవుల్లోనే నిర్వహించాడు. అంతేకాదు, పార్టీ క్యాడర్‌కు ప్రథమ చికిత్స, అత్యవసర వైద్యంపై శిక్షణ కూడా ఇచ్చినట్లు సమాచారం.


అబూజ్‌మఢ్ ప్రాంతంలోని మావోయిస్టు ప్రధాన కేంద్రంలో రఫీక్ సేవలు అత్యంత కీలకంగా ఉండేవని చెబుతున్నారు. ఆపద సమయంలో ఆయన మావోయిస్టుల పాలిట దేవుడిలా మారిపోయాడని లొంగిపోయిన నేతలు వెల్లడించారు. డాక్టర్ రఫీక్ పేరు 2013లో తొలిసారి భద్రతా బలగాల దృష్టికి వచ్చింది. అరెస్టయిన మావోయిస్టుల సమాచారంతో ఇంటెలిజెన్స్ విభాగం ఆయనపై దృష్టి పెట్టింది. 2018లో ఓ సీనియర్ మావోయిస్టు కమాండర్ ప్రశాంత్ బోస్‌కు రఫీక్ భార్య రింకీ చికిత్స అందించిందన్న సమాచారం కూడా పోలీసులకు చేరింది. అయితే అప్పటికే రఫీక్ 2016లోనే దండకారణ్యాన్ని విడిచి ఝార్ఖండ్‌కు మకాం మార్చినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆ తర్వాత ఆయన ఆచూకీ మాత్రం ఇప్పటివరకు పూర్తిగా బయటపడలేదని తెలుస్తోంది.


మావోయిస్టు పార్టీలో పనిచేసిన ఏకైక శిక్షణ పొందిన వైద్యుడిగా రఫీక్ పేరు వినిపిస్తోంది. ఒకసారి ఎన్‌కౌంటర్ సమయంలో ఓ మావోయిస్టు ఛాతీలోకి దూసుకెళ్లిన తూటా గుండెకు అతి సమీపంలో ఇరుక్కుపోయింది. ఆ సమయంలో అడవుల్లో ఎలాంటి వైద్య పరికరాలు లేకుండా, కేవలం టార్చ్ లైట్ వెలుతురులోనే శస్త్రచికిత్స చేసి బుల్లెట్‌ను విజయవంతంగా బయటకు తీశాడని లొంగిపోయిన మావోయిస్టు చందర్ పోలీసులకు వివరించినట్లు సమాచారం.


డాక్టర్ రఫీక్ కేవలం చికిత్సలకే పరిమితం కాలేదు. బుల్లెట్ గాయాలు, మలేరియా, పాము కాటు వంటి అంశాలపై ప్రత్యేకంగా మెడికల్ మాన్యువల్స్ కూడా రచించాడు. మావోయిస్టు క్యాడర్‌తో పాటు స్థానిక ఆదివాసీలకు ఉపయోగపడేలా ఈ మాన్యువల్స్ రూపొందించాడని చెబుతున్నారు. అంతేకాదు, స్థానిక యువతను పారామెడిక్స్‌గా తయారు చేస్తూ వైద్య కార్యకర్తలను ఆయన తయారు చేశాడని సమాచారం.


ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన జన నాట్య మండలి / చేతన నాట్య మంచ్‌కు చెందిన మావోయిస్టు ఎం.వెంకట్రాజు అలియాస్ చందర్ ఇచ్చిన సమాచారంతో డాక్టర్ రఫీక్ పేరు మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం రఫీక్ ఇంకా ఝార్ఖండ్‌లోనే ఉన్నాడని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. మావోయిస్టు ఉద్యమంలో ఆయుధాలకంటే వైద్య సేవలతో కీలక పాత్ర పోషించిన డాక్టర్ రఫీక్ కథ... ఇప్పుడు భద్రతా వర్గాలకు సవాల్‌గా మారింది.

Rafiq
Doctor Rafiq
Maoist party
Naxalites
Dandakaranya
Chhattisgarh
Bastar
Jharkhand
Naxalite Doctor
Paramedics

More Telugu News