Silver Price: ఫ్యూచర్ మార్కెట్‌లో భారీగా పడిపోయిన వెండి ధరలు, బంగారం కూడా తగ్గుబాటు

Silver Prices Crash in Future Market Gold Also Falls
  • 2.54 లక్షల నుంచి గంటలో రూ.2.33 లక్షల కనిష్ఠాన్ని తాకిన వెండి
  • స్పాట్ మార్కెట్‌లో కూడా రూ.2.39 లక్షలకు పడిపోయిన ధర
  • ఫ్యూచర్ మార్కెట్‌లో రూ.1.37 లక్షల స్థాయికి పడిపోయిన బంగారం
ఫ్యూచర్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఎంసీఎక్స్‌లో మార్చి కాంట్రాక్ట్ వెండి కిలో ధర రూ.21 వేలు పడిపోయింది. సోమవారం రూ.2.54 లక్షలతో గరిష్ఠాన్ని తాకిన వెండి ఆ తర్వాత గంటలోనే 2.33 లక్షల కనిష్ఠాన్ని తాకింది.

స్పాట్ మార్కెట్‌లో కూడా వెండి ధర తగ్గింది. హైదరాబాద్‌లో అంతకుముందు రూ.2.50 లక్షలు పలికిన వెండి కిలో ధర రూ.2.39 లక్షల స్థాయికి దిగి వచ్చింది.

భౌగోళిక అనిశ్చితుల కారణంగా ఇటీవల బంగారం, వెండి ధరలు దూసుకుపోయాయి. ముఖ్యంగా వెండి ధరలు ఎన్నడూ లేని రీతిలో పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో 50 డాలర్లకు దిగువనే ట్రేడవుతూ వచ్చిన వెండి ఇటీవల అనూహ్యంగా పెరిగింది. సోమవారం ఒక దశలో 80 డాలర్ల పైకి చేరుకుంది.

ఫ్యూచర్ మార్కెట్‌లో బంగారం ధర కూడా సుమారు 2 శాతం పడిపోయింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ.1.37 లక్షల స్థాయికి పడిపోయింది. ఫ్యూచర్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పడిపోవడానికి వివిధ కారణాలు ఉన్నాయి.

రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం విషయంలో కీలక ముందడుగు పడింది. శాంతి ఒప్పందానికి ఇరువురు దేశాధినేతలు సుముఖంగా ఉండటంతో యుద్ధానికి తెరపడుతుందన్న అంచనాలు వెండి ధర పడిపోవడానికి కారణమైంది. వెండి ఏడాదిలో 181 శాతం పెరిగింది. గరిష్ఠాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు.
Silver Price
MCX
Gold Price
Commodity Market
Russia Ukraine War
Hyderabad Silver Rate
Future Market

More Telugu News