Kichcha Sudeep: ఇండస్ట్రీలో సహకార లోపంపై కిచ్చా సుదీప్ కీలక వ్యాఖ్యలు
- ఇతర భాషల చిత్రాల్లో అతిథి పాత్రలు పోషించడానికి తాను వెనుకాడనన్న సుదీప్
- ఇతర భాషల స్టార్లు కన్నడ సినిమాల్లోకి రావడం తక్కువగా ఉందని వ్యాఖ్య
- ఇది ఇండస్ట్రీల మధ్య సహకార లోపాన్ని సూచిస్తోందన్న సుదీప్
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలోని పరస్పర సహకారం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇతర భాషల సినిమాల్లో అతిథి పాత్రలు లేదా కీలక పాత్రలు చేయడానికి వెనకాడనని సుదీప్ తెలిపారు. కానీ, ఇతర భాషల స్టార్ హీరోలు కన్నడ సినిమాలకు రావడం మాత్రం చాలా తక్కువగా ఉందని... ఇది ఇండస్ట్రీల మధ్య ఉన్న సహకార లోపాన్ని వెల్లడిస్తోందని చెప్పారు.
తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తాను అతిథి పాత్రలు చేశానని... కొన్నిసార్లు డబ్బు తీసుకోకుండా ఫ్రెండ్‌షిప్ కోసం నటించానని సుదీప్ తెలిపారు. సల్మాన్ ఖాన్ అడిగినందుకు ‘దబాంగ్ 3’లో నటించానని, విజయ్ కోసం ‘పులి’ సినిమాలో నటించానని వెల్లడించారు. అలాగే శివరాజ్ కుమార్ కూడా ఇతర భాషా సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేశారని గుర్తు చేశారు.
“ఇండస్ట్రీలో కొందరు స్టార్స్ మాత్రమే కాలాన్ని తట్టుకుని నిలుస్తారు. అమితాబ్ బచ్చన్, కమలహాసన్, రజనీకాంత్ లాంటి వారు జీవితాంతం నటిస్తూ అభిమానుల ప్రేమను పొందుతూనే ఉంటారు. చాలా మంది స్టార్‌లు ఒక దశ తర్వాత కనుమరుగవుతారు” అని సుదీప్ అన్నారు. ఆయన తెలుగులో ‘ఈగ’, ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘సైరా నర్సింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు.