Boy alone in Forest: అడవిలో తండ్రి మృతదేహం, స్పృహ కోల్పోయిన తల్లితో ఐదేళ్ల బాలుడు!

5 Year Old Boy Found with Fathers Body in Odisha Forest
  • పక్కనే అపస్మారక స్థితిలో బాలుడి తల్లి
  • బంధువుల ఇంటికి వెళ్లి వస్తూ గొడవ పడ్డ భార్యాభర్తలు
  • అడవిలోకి వెళ్లి విషం తాగడంతో భర్త మృతి
చుట్టూ అడవి.. పక్కనే ఉలుకూ పలుకు లేకుండా పడి ఉన్న తల్లిదండ్రులు.. చిమ్మ చీకట్లో ఎటు వెళ్లాలో తెలియదు, తల్లిదండ్రులు ఎందుకు లేవడం లేదో అస్సలు తెలియదు.. ఎవరిని పిలవాలి, ఏం చేయాలో అర్థం కాక ఐదేళ్ల బాలుడు రాత్రంతా అక్కడే గడిపాడు. తండ్రి చనిపోయాడని, తల్లి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోందని తెలియక జాగారం చేశాడు. తెల్లవారాక దారి వెతుక్కుంటూ రోడ్డుపైకి వచ్చిన బాలుడిని గమనించిన బాటసారులు ఆరాతీయగా అడవిలో చోటుచేసుకున్న దారుణం వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని డియోగఢ్ జిల్లా కుందేయిగోల అడవుల్లో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

డియోగఢ్ జిల్లా జియాంతపాలి గ్రామానికి చెందిన దుష్మంత్ మాఝీ, రింకీ మాఝీ దంపతులకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. శనివారం దుష్మంత్, రింకీలు తమ కుమారుడితో కలిసి రింకీ పుట్టింటికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో కుందేయిగోల అటవీ ప్రాంతంలో దుష్మంత్ బైక్ ను ఆపేశాడు. కొడుకుతో కలిసి భార్యాభర్తలు ఇద్దరూ అడవి లోపలికి వెళ్లి, తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో దుష్మంత్ ప్రాణాలు కోల్పోగా, రింకీ స్పృహ కోల్పోయింది.

ఎంత పిలిచినా పలకకపోవడంతో తల్లిదండ్రులు నిద్రపోతున్నారని భావించిన బాలుడు ఏం చేయాలో తెలియక రాత్రంతా తండ్రి మృతదేహం పక్కనే కూర్చున్నాడు. తెల్లవారాక దారి వెతుక్కుంటూ రోడ్డుపైకి వచ్చిన బాలుడిని బాటసారులు గమనించారు. వారిని వెంటబెట్టుకుని తల్లిదండ్రులు పడి ఉన్న చోటుకు తీసుకెళ్లడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. 

అడవిలో పడి ఉన్న దుష్మంత్, రింకీలను గమనించిన ఆ బాటసారులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. అంబులెన్స్ లో దుష్మంత్, రింకీలను ఆసుపత్రికి తరలించారు. దుష్మంత్ అప్పటికే మరణించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రింకీ కూడా చనిపోయింది. బాలుడికి కూడా పురుగుల మందు తాగించారనీ, అయితే అది స్వల్ప మొత్తం కావడంతో అతను బతికిపోయాదనీ వైద్యులు తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాలుడిని తాత, అమ్మమ్మలకు అప్పగించారు.
Boy alone in Forest
Parents Suicide
Odisha
Deogarh
Suicide
Child Alone
Forest Death
Rinky Majhi
Poison Suicide
Dushmant Majhi
Family Tragedy
India News

More Telugu News