Tirupati SP Subbarayudu: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం... పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

Tirupati SP Subbarayudu Announces Security for Tirumala Vaikunta Dwara Darshan
  • వైకుంఠ ద్వార దర్శనం పురస్కరించుకుని పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టామన్న ఎస్పీ సుబ్బారాయుడు
  • డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయని వెల్లడి
  • ప్రతిరోజూ 60 వేల టోకెన్ల చొప్పున దర్శనాల కేటాయింపు జరిగిందన్న ఎస్పీ
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలలో భక్తుల భద్రత కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు.
 
డిసెంబర్ 30, 2025న వైకుంఠ ఏకాదశి, జనవరి 8, 2026న వైకుంఠ ద్వాదశి పర్వదినాల నేపథ్యంలో మొత్తం 10 రోజుల పాటు (డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు) వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుందని ఎస్పీ వెల్లడించారు. ఈ కాలంలో తిరుమల అంతటా పటిష్టమైన పోలీసు బందోబస్తు అమలు చేస్తున్నట్లు చెప్పారు.
 
సుమారు 2 వేల మంది పోలీసు సిబ్బందితో తిరుమలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1 తేదీల్లో టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో సుమారు 25 లక్షల మంది భక్తులు దర్శన టోకెన్ల కోసం దరఖాస్తు చేసుకోగా, ప్రతిరోజూ 60 వేల టోకెన్ల చొప్పున దర్శనాల కేటాయింపు జరిగిందన్నారు. భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, క్యూలైన్ నిర్వహణ, సీసీటీవీ నిఘా వంటి ఏర్పాట్లను ముందుగానే అమలు చేస్తున్నట్లు చెప్పారు. 
 
టీటీడీ అధికారులతో సమన్వయం చేసుకుని విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు పలు సూచనలు చేస్తూ, దర్శన సమయంలో క్రమశిక్షణ పాటిస్తూ, శాంతియుతంగా వ్యవహరించాలని, పోలీసు సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. పిల్లలు, వృద్ధులు, విలువైన ఆభరణాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  
Tirupati SP Subbarayudu
Tirumala
Vaikunta Ekadasi
Vaikunta Dwadasi
TTD
Tirupati police
Vaikunta Dwara Darshanam
Tirumala security
Andhra Pradesh temples
Temple festival

More Telugu News