Suresh Babu: ఫిల్మ్ ఛాంబర్‌ అధ్యక్షుడిగా సురేష్ బాబు... 'ప్రోగ్రెసివ్ ప్యానల్' ఘన విజయం

Progressive Panel wins Telugu Film Chamber Elections
  • తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో 'ప్రోగ్రెసివ్ ప్యానల్' ఘన విజయం
  • నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఎన్నిక
  • మొత్తం 44 ఈసీ స్థానాల్లో 28 కైవసం చేసుకున్న ప్రోగ్రెసివ్ ప్యానల్
  • సి. కళ్యాణ్ నేతృత్వంలోని 'మన ప్యానల్'‌కు 15 స్థానాలు
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ - TFCC) 2025-27 సంవత్సర కాలానికి జరిగిన ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు వంటి వారి మద్దతుతో బరిలోకి దిగిన 'ప్రోగ్రెసివ్ ప్యానెల్' ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. నిర్మాతలు సి. కల్యాణ్, టి. ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు బలపరిచిన 'మన ప్యానెల్'‌పై... 'ప్రోగ్రెసివ్ ప్యానెల్' స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది.

హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి సాయంత్రానికి తుది ఫలితాలను ప్రకటించారు. మొత్తం 44 ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) స్థానాలకు గాను, 'ప్రోగ్రెసివ్ ప్యానెల్' ఏకంగా 28 స్థానాలను కైవసం చేసుకుని ఛాంబర్‌పై పట్టు సాధించింది. 'మన ప్యానెల్' 15 స్థానాలతో సరిపెట్టుకుంది. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో ఒక స్థానం టైగా నిలిచింది.

ప్రోగ్రెసివ్ ప్యానెల్ మెజారిటీ సాధించడంతో కీలక పదవులన్నీ ఆ ప్యానెల్ సభ్యులకే దక్కాయి. వైస్ ప్రెసిడెంట్‌గా నాగవంశీ, సెక్రటరీగా అశోక్ కుమార్, ట్రెజరర్‌గా ముత్యాల రాందాస్ ఎన్నికయ్యారు. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ వైస్ ప్రెసిడెంట్‌గా భరత్ చౌదరి, స్టూడియో సెక్టార్ వైస్ ప్రెసిడెంట్‌గా కిరణ్ బాధ్యతలు చేపట్టనున్నారు.

విభాగాల వారీగా చూస్తే, ఎగ్జిబిటర్స్ సెక్టార్‌లో 'ప్రోగ్రెసివ్ ప్యానెల్' పూర్తి ఆధిపత్యం చూపింది. ఈ విభాగంలోని 16 స్థానాలకు గాను 14 స్థానాలను గెలుచుకుంది. అయితే, ప్రొడ్యూసర్స్ సెక్టార్‌లో మాత్రం 'మన ప్యానెల్' 7 స్థానాలు గెలుచుకుని పైచేయి సాధించగా, ప్రోగ్రెసివ్ ప్యానెల్‌కు 5 స్థానాలు దక్కాయి.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో యజమానులతో కలిపి మొత్తం 3,355 మంది సభ్యులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కొత్త కార్యవర్గం 2027 జులై వరకు బాధ్యతల్లో కొనసాగుతుంది. 
Suresh Babu
Telugu Film Chamber of Commerce
TFCC Elections
Progressive Panel
Dil Raju
Allu Aravind
C Kalyan
Telugu Film Industry
Film Chamber Elections 2025-27

More Telugu News