Chandrababu Naidu: నన్ను చాలా మంది ఐఏఎస్ చేయమన్నారు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Reveals Many Suggested He Become an IAS Officer
  • ఐఏఎస్ అవ్వమన్నా ప్రజాసేవకే ప్రాధాన్యతనిచ్చానన్న చంద్రబాబు
  • తన అర్ధాంగి నారా భువనేశ్వరి బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడిన సీఎం
  • గండిపేట ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు దంపతులు
  • విలువలతో కూడిన విద్యతోనే సమాజంలో గుర్తింపు సాధ్యమని హితవు
తనను చాలామంది ఐఏఎస్ అధికారి కావాలని సూచించారని, కానీ తాను ప్రజాసేవకే ప్రాధాన్యతనిచ్చి రాజకీయాల వైపు అడుగులు వేశానని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. యూనివర్సిటీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచానని, అనతికాలంలోనే మంత్రిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు నాలుగోసారి సీఎంగా సేవ చేసే అవకాశం లభించిందని తెలిపారు. హైదరాబాద్‌ గండిపేటలోని ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో శనివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా తన సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరిపై ఆయన ప్రశంసలు కురిపించారు. తాను రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్న సమయంలో, అయిష్టంగానే హెరిటేజ్ బాధ్యతలు స్వీకరించిన భువనేశ్వరి, తన పట్టుదలతో ఆ సంస్థను అద్భుతంగా అభివృద్ధి చేశారని కొనియాడారు. 

“నేను ఇప్పటికీ కాగితం చూసి ప్రసంగిస్తుంటే, భువనేశ్వరి ట్యాబ్ చూసి మాట్లాడుతున్నారు. నేను టెక్నాలజీ గురించి చెబుతుంటాను, ఆమె టెక్నాలజీని ఆచరణలో పెట్టి వినియోగిస్తున్నారు. మామగారు ఎన్టీఆర్ మాదిరిగానే భువనేశ్వరికి పట్టుదల, మొండితనం ఉన్నాయి. ఏదైనా పని మొదలుపెడితే పూర్తిచేసే వరకు వదలరు” అని అన్నారు. 

భార్యగా, తల్లిగా, వ్యాపారవేత్తగా, ట్రస్టీగా బహుముఖ పాత్రలను సమర్థవంతంగా పోషిస్తున్నారని అభినందించారు. హెరిటేజ్ సంస్థను అద్భుతంగా నడిపిస్తున్నందుకు లండన్‌లోని ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్’ సంస్థ భువనేశ్వరికి గోల్డెన్ పీకాక్ అవార్డుతో పాటు వ్యక్తిగత పురస్కారాన్ని కూడా అందించిందని గుర్తు చేశారు.

అంతకుముందు, గండిపేట ప్రాంగణానికి విచ్చేసిన చంద్రబాబు దంపతులకు ఎన్టీఆర్ విద్యా సంస్థల విద్యార్థులు గౌరవ వందనం సమర్పించారు. ప్రాంగణంలో కలియతిరుగుతూ పాత స్మృతులను నెమరువేసుకున్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవాలను ప్రారంభించిన అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు.

ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, చదువు ఎంత ముఖ్యమో, విలువలు అంతకంటే ముఖ్యమని విద్యార్థులకు హితవు పలికారు. “లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి సారించాలి. విద్యతోనే పేదరికాన్ని జయించవచ్చు, అప్పుడు సంపద దానంతట అదే వస్తుంది” అని అన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన కార్యకర్తల పిల్లలకు ఈ విద్యా సంస్థల ద్వారా విద్యను అందిస్తున్నామని తెలిపారు.
Chandrababu Naidu
NTR Educational Institutions
Nara Bhuvaneswari
Heritage Foods
IAS officer
Political career
Telangana
Gandi Pet
Annual day celebrations
Golden Peacock Award

More Telugu News