Anasuya: నా దుస్తుల విషయంలో నా భర్తను, పిల్లలను కూడా లాగుతున్నారు: అనసూయ ఫైర్
- నాలాంటి దుస్తులు వేసుకోవాలని ఎవరికీ చెప్పలేదన్న అనసూయ
- తన వ్యాఖ్యలను కొన్ని మీడియా హౌసులు వక్రీకరిస్తున్నాయని మండిపాటు
- సమస్య కేవలం బట్టల గురించి మాత్రమే కాదని వ్యాఖ్య
మహిళల వస్త్రధారణ విషయంలో ఇటీవల నటుడు శివాజీ వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం, క్రమంగా శివాజీ వర్సెస్ అనసూయ అన్నట్టుగా మారిన నేపథ్యంలో... మరోసారి అనసూయ స్పందించారు. ఈ అంశంపై తన అభిప్రాయాలను వక్రీకరిస్తూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఆమె వరుసగా సోషల్‌మీడియా పోస్టులు పెట్టారు.
‘‘ఈ విషయం మీద నేను మరోసారి స్పష్టంగా మాట్లాడాలనిపించింది’’ అంటూ మొదలుపెట్టిన అనసూయ, తన మాటలను కావాలనే తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్న కొన్ని మీడియా సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత లేని కొన్ని మీడియా హౌసులు, చేతిలో స్మార్ట్‌ఫోన్ పట్టుకుని ఇష్టమొచ్చినట్లు రాసే వ్యక్తులు కలిసి తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. దీనిని ఆమె 'టెక్స్ట్‌బుక్ గ్యాస్‌లైటింగ్'గా అభివర్ణించడం గమనార్హం.
‘‘నేను ఎవరినీ నాలాంటి దుస్తులు వేసుకోవాలని చెప్పలేదు. నా వ్యక్తిగత ఎంపికలను ఎవరి మీదా రుద్దలేదు. కానీ, ప్రతి మహిళకు తాను నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉండాలి అనే మాటకు మాత్రం నేను కట్టుబడి ఉంటాను’’ అని అనసూయ స్పష్టం చేశారు. తన వాదనను పూర్తిగా వదిలేసి, దాన్ని వేరే అర్థాల్లో చూపించడం సమాజాన్ని తప్పుదోవ పట్టించడమేనని ఆమె అన్నారు.
ఇక తన దుస్తుల ఎంపికను కారణంగా చూపించి తన భర్తను, పిల్లలను విమర్శలకు గురిచేయడం అత్యంత దిగజారిన చర్య అని అనసూయ మండిపడ్డారు. ‘‘ఇది కేవలం బట్టల గురించి కాదు. స్వతంత్రంగా ఆలోచించే మహిళలను చూసి భయపడే పితృస్వామ్య భావజాలం నుంచే ఇలాంటి విమర్శలు వస్తున్నాయి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
విమర్శకులపై చురకలు వేస్తూ, ‘‘నన్ను ఇష్టపడకపోయినా, నేను చేసే ప్రతి పనిని గమనిస్తున్నారంటే… మీరు కూడా నా అభిమానుల కిందే లెక్క’’ అని అనసూయ వ్యాఖ్యానించారు. తన వ్యక్తిత్వం, అభిప్రాయాలు కొందరికి నచ్చకపోవచ్చుననీ, అంతమాత్రాన తనపై విష ప్రచారం చేయడం సరికాదని ఆమె స్పష్టం చేశారు.
చివరగా, ఎవరో చెప్పారని లేదా రెచ్చగొట్టారని కీలుబొమ్మలుగా మారి ఇతరుల జీవితాలపై తీర్పు చెప్పవద్దని నెటిజన్లకు సూచించారు. సొంతంగా ఆలోచించడం నేర్చుకోవాలని, సమాజంలో మహిళల స్వేచ్ఛను గౌరవించే దిశగా ముందుకు సాగాలని ఆమె వ్యాఖ్యానించారు.